Monday, November 18, 2024

మొబైల్ తో మీటర్ రీడింగ్.. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి

ప్రభన్యూస్‌, హైదరాబాద్‌ : టీఎస్‌ ఎస్‌పీడీసీఎల్‌ అధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. ఇప్పటికే బిల్లుల చెల్లింపులు, విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు, విద్యుత్‌ కొత్త కనెక్షన్లు తదితర అనేక విషయాలకు అధునిక సాంకేతికతను ఉపయోగించుకుని దూసుకపోతున్న విద్యుత్‌ సంస్థలు ప్రస్తుతం మరో టెక్నాలజీని అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ఇప్పటి వరకు మీటర్‌ రీడర్‌ ఇంటింటికి తిరిగి బిల్లులు ఇచ్చేవారు. ఇక ముందు మీ బిల్లు ఇవ్వడానికి మీటర్‌ రీడర్‌ రావాల్సిన అవసరం లేదు. మీ సెల్‌ఫోన్‌తో మీరే మీటర్‌ రీడింగ్‌ స్కాన్‌ చేసుకుని బిల్లు తీసుకునే విధానం అందుబాటులోకి వచ్చింది.
టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ కరోనా సమయంలో ఇందుకు సంబంధించిన సేవలను ప్రారంభించినప్పటికి ప్రస్తుతం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. విద్యుత్‌ సిబ్బంది కొరతతో విద్యుత్‌ బిల్లుల జారీ ప్రక్రియ ఆలస్యం అవుతుంది. దీనితో నెల రోజుల (30 రోజులలో) బిల్లును వినియోగదారునికి అందించలేక పోతున్నారు. కొత్త విధానంతో 30రోజులు కాగానే మీ సెల్‌ ఫోన్‌తో సెల్ఫ్‌ మీటర్‌ రీడింగ్‌ తీసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది సంస్థ. వినియోగదారులకోసం సంస్థ ఐటీ యాప్‌లో కన్జ్యూమర్‌ సెల్ఫ్‌ బిల్లింగ్‌ ఐచ్చికాన్ని జోడించి గూగుల్‌ ఫ్లేస్టోర్‌లో అందుబాటులో ఉంచింది.

ఎలా చేయాలి…

ఫ్లే స్టోర్‌ నుంచి టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ ఐటీ యాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఇప్పటికే ఈ యాప్‌ను వినియోగిస్తున్న వారుసైతం అప్‌డేట్‌ చేసుకోవాలి. యాప్‌ తెరవగానే కన్జ్యూమర్‌ సెల్ఫ్‌ బిల్లింగ్‌ ఐచ్చికం కనిపిస్తుంది. కొత్తగా యాప్‌ వాడుతున్నట్లయితే యునిక్‌ సర్వీస్‌ నంబర్‌, ఈ మెయిల్‌, మొబైల్‌ నంబరు వంటి వివరాలు నమోదు చేసుకోవాలి. మీరు ఏ మీటర్‌ బిల్లింగ్‌ తీసుకోవాలనుకుం టున్నారో దాన్ని ఎంచుకోగానే మీటర్‌ స్కానింగ్‌ అని చూపిస్తుంది. దానిపై క్లిక్‌చేసి మీటర్‌లో కేడబ్ల్యూహెచ్‌ అంకెలు వచ్చినప్పుడు స్కాన్‌ చేయాలి. వివరాలన్నీ సక్రమంగా ఉంటే నెక్ట్స్‌ అని చూపిస్తుంది. చెల్లింపు అవకాశం కూడా అందులో ఉన్నది. వినియోగదారులకు ఈ విషయాలన్నీ అర్థమయ్యేలా యాప్‌లో డెమో వీడియోలను తెలుగులో అందుబాటులో ఉంచారు. ఒకవేళ మీ కంటే ముందే సిబ్బంది వచ్చి మీటర్‌ రీడింగ్‌ తీసి ఉంటే ఆ విషయం యాప్‌లో కనబడుతుంది. మీరే ముందు రీడింగ్‌ స్కానింగ్‌ చేసి బిల్లు తీసుకుంటే రీడింగ్‌ సిబ్బందికి బిల్‌ జనరేటెడ్‌ అని సమాచారం వెలుతుంది. నెల రోజుల కంటే ముందే బిల్లు రీడింగ్‌ తీసుకోవాలని ప్రయత్నించిన అది సాధ్యం కాదు. ఆ కంట్రోల్‌ సిస్టమ్‌ అంతా విద్యుత్‌ అధికారుల వద్దనే ఉంటుందని అధికారులు తెలిపారు. మీ కరెంట్‌ మీటర్‌ రీడింగ్‌ మీరే తీసుకునే విధానాన్ని ఎస్‌పీడీసీఎల్‌ పరిధిలోని అన్ని సర్కిళ్లలో అందుబాటులోకి వచ్చింది. గృహా వినియోగ కనెక్షన్లపై (కేటగిరి-1, కెటగిరి-2)లో మొబైల్‌తో మీటర్‌ రీడింగ్‌ తీసుకోవచ్చు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మొత్తం 55లక్షలకుపైగా ఉన్న విద్యుత్‌ కనెక్షన్లలో 48లక్షలకు పైగా గృహా వినియోగదారులవే ఉన్నాయి. గ్రేటర్‌ పరిధిలో ఉన్న తొమ్మిది సర్కిళ్ళలో అందుబాటులోకి వచ్చింది.
30రోజుల తర్వాతనే బిల్లు తీసుకోవాలి.. విద్యుత్‌ బిల్లును సెల్‌ఫోన్‌ యాప్‌ ద్వారా తీసుకునే వారు ఖచ్చితంగా ముందు తీసిన బిల్లు తేదీకి 30రోజులు పూర్తి కావాలి. 30 రోజుల కంటే ముందు బిల్లు తీసి చెల్లిస్తే 30 రోజుల తర్వాత డిస్కం సిబ్బంది వచ్చి మళ్లి బిల్లు తీస్తే జనరేటేడ్‌ అని వస్తుంది. ఈ సమస్య రాకుండా సెల్‌ఫోన్‌తో మీటర్‌ రీడింగ్‌ తీస్తే అది 30రోజుల తర్వాతనే వచ్చేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement