హైదరాబాద్, ఆంధ్రప్రభ: దేశానికి గుణాత్మక మార్పు లక్ష్యంగా తొలి ఆరంట్రేటం అడుగు వేస్తున్న తెలంగాణ ఉద్యమ గుమ్మం ఖమ్మంలో బీఆర్‌ఎస్ భారీ బహిరంగసభకు సర్వం సిద్ధమైంది. ఈ సభకు అట్టహాసం గా ఏర్పాట్లు జరుగుండగా, దేశంలోని ముగ్గురు ముఖ్యమంత్రులు, పలువురు జాతీయ కీలక నేతలు హాజరవుతున్నారు. 5లక్షల మందితో జాతీయస్థాయిలో దేశం దృష్టిని ఆకర్శించేలా సభ నిర్వహణకు బీఆర్‌ఎస్ ఏర్పాట్లు చేస్తోండగా, ఈ సభలో ఆహుతులు, అథితులకు విందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఔరా అన్నట్లుగా జరుగుతున్నాయి. అసలే జాతీయ నేతలు, ముగ్గురు ముఖ్యమంత్రులు హాజరవుతున్న భారీ మీటింగ్, ప్రజలకు బీఆర్‌ఎస్ లక్ష్యాలు, సిద్దాంతాలు వివరించే ఈ సభలో అంతే స్థాయిలో వారికి విందు ఏర్పాట్లు
చేస్తున్నారు. జాతీయ నేతలకు తెలంగాణ సాంప్రదాయ రుచులు చూపించాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు అనువుగా రకరకాల మెనూతో భారీ ఎత్తున ఐటెమ్స్ తయారు చేయిస్తున్నట్లు సమాచారం. ఇందులో 17 రకాల నాన్ వెజ్, 21 రకాల వెజ్ వంటలు సిద్ధం చేయనున్నారు.
ఖమ్మం నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం, బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభకు హాజరయ్యే ముఖ్యఅతిథులకు ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చేందుకు పార్టీ నాయకత్వం చర్యలు తీసుకుంటోంది. ముగ్గురు ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్‌యాదవ్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా తదితరులకు ఉదయం అల్పాహారం, ఖమ్మంలో భోజనం మెనూను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ సంప్రదాయ వంటలను అతిథులకు రుచి చూపించనుంది. 17 రకాల నాన్ వెజ్, 21 రకాల వెజ్ వంటలు సిద్ధం చేయనుంది. మటన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, ప్రాన్ బిర్యానీ, కొరమేను కూర, తెలంగాణ మటన్ కర్రీ, తలకాయ ఇగురు, నాటుకోడి కూర, బొమ్మిడాయల పులుసు, బోటీ ఫ్రై, మటన్ లివర్ ఫ్రైతో విందు ఇవ్వనుంది. పనీర్ బటర్ మసాలా, మెతీ చమన్, దాల్ తడ్కా, బచ్చలకూర మ్యాంగో పప్పు, బీరకాయ శనగపప్పు కూర, బెండకాయ కాజు ఫ్రై, ముద్దపప్పు, పచ్చిపులుసు వంటి వెజ్ కూరలు సిద్ధం చేయనుంది. ఈ మెనూతో మొత్తం 500 మంది విందు ఆరగించనున్నారు.
భారీ నిఘా…
నలుగురు ముఖ్యమంత్రులు, మాజీ సీఎం, పలువురు జాతీయ నేతలు ఖమ్మంలో పర్యటిస్తున్నందున తొమ్మిది మంది ఐపీఎస్‌ల పర్యవేక్షణలో బందో బస్తు కొనసాగనుంది. మొత్తం 4,202 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయను న్నారు. అదనపు డీజీ విజయకుమార్, ఐజీపీలు షానావాజ్ ఖాసీం, చంద్రశేఖ ర్‌రెడ్డి, వరంగల్ పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ తదితరులు ఇప్పటికే భద్రతా పర్యవేక్షణలో బిజీగా ఉన్నారు.