మహబూబ్ నగర్,ఆగస్ట్ 21 (ప్రభ న్యూస్): రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ద్వారా గత సంవత్సరం రాష్ట్రంలోని 17 జిల్లాలలో జాబ్ మేళాలు నిర్వహించి 32 వేల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సోమవారం ఆయన మహబూబ్ నగర్ లోని సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలో సెప్టెంబర్ 2 న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లోని శిల్పారామం లో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా కు సంబంధించిన గొడవ పత్రికను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ ఈ 32 వేల మందికి అప్పటికప్పుడే ఉత్తర్వులు సైతం ఇచ్చినట్లు తెలిపారు.
మహబూబ్ నగర్ జిల్లాలో గత సంవత్సరం 2800 మందికి ఉద్యోగాలు కల్పించామని, జీడిమెట్ల, ఎల్బీనగర్, హైదరాబాద్ లోని పారిశ్రామిక కంపెనీలతో మాట్లాడి ఉద్యోగాలు ఇప్పించామని తెలిపారు. గత నెల మహబూబ్నగర్ ఐటి కారిడార్ లో 750 మందికి ఐటీ కంపెనీల లోనే ఉద్యోగాలు ఇచ్చే విధంగా జాబ్ మేళాను నిర్వహించామని అన్నారు. సెప్టెంబర్ 2న మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ నియోజకవర్గంలోని నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్దేశించి పదివేల మందికి ఉద్యోగాలు కల్పించేందుకుగాను 105 కంపెనీలకు సంబంధించిన ఖాళీలలో ఉద్యోగాలు కల్పించనున్నామని అదే రోజే ఇంటర్వ్యూలు చేయటం, అదే రోజే ఉత్తర్వులు సైతం అందజేస్తామని తెలిపారు. 15000 నుండి లక్ష రూపాయల వరకు జీతం వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని, పదవ తరగతి మొదలుకొని డిగ్రీ వరకు అర్హతకు తగ్గట్టుగా ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపారు .
ఈ మేరకు ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. జిల్లాలోని మహబూబ్నగర్ నియోజకవర్గంలోని అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆ తర్వాత మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులకు ప్రత్యేక జాబ్ మేళా ఏర్పాటు చేస్తామని , ఆ తదుపరి మహబూబ్నగర్, నారాయణపేట నియోజకవర్గం అభ్యర్థులకు, అనంతరం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నియోజకవర్గాలలోని నిరుద్యోగ అభ్యర్థులు అందరికి జాబ్ మేళాలు నిర్వహిస్తామని వెల్లడించారు .
జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు నిరుత్సాహ పడకుండా వారికోసం స్కిల్, ఆన్ స్కిల్ ట్రైనింగ్ కూడా ఇస్తామని, త్వరలోనే ఐటి టవర్లో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి శాశ్వత ప్రాతిపదికన శిక్షణ ఇస్తామని,ప్రత్యేకించి మహిళలకు శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇదివరకే న్యాక్ ద్వారా శిక్షణ ,ఉపాధి కల్పిస్తున్నామని, ప్రతి మూడు నెలలకు ఒకసారి 45 కోర్సులలో శిక్షణ కొనసాగిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. నియోజకవర్గంలోని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు.జిల్లా కలెక్టర్ జి రవి నాయక్ మాట్లాడుతూ గత నెల జిల్లాలో నిర్వహించిన జాబ్ మేళాలో సాఫ్ట్వేర్ ,డిగ్రీ వారి కోసం నిర్వహించడం జరిగిందని, విద్యార్హతలు బట్టి ఉద్యోగాలు ఇస్తున్నామని, ఎవరికైనా శిక్షణ అవసరమైతే శిక్షణ ఇచ్చి ఉద్యోగాలకు ఎంపిక చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
సెట్విన్ ఏమ్ డి వేణుగోపాల్, ఆడిషల్ ఎస్పి రాములు ,డి.ఎస్.పి మహేష్ సెట్ మా మేనేజర్ విజయ్ కుమార్ తదితరులు ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు.