వికారాబాద్, ప్రభన్యూస్ : ఖరీఫ్(వానాకాలం)లో పండించిన వరిధాన్యంను విక్రయించేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఒకవైపు ప్రతికూల వాతావరణ పరిస్థితులు రైతులను భయపెడుతున్నాయి. మరోవైపు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. రోజుల తరబడి వేచిఉన్నా రైతులకు గోనె సంచులు దొరకని పరిస్థితి నెలకొంది. రైతుల ఎదుర్కొంటున్న పరిస్థితిని ఆసరాగా చేసుకొని కొందరు మధ్యవర్తులు..మరికొందరు మిల్లర్లు రంగంలోకి దిగారు. నేరుగా వరిధాన్యంను కొనుగోలు చేస్తామని హామీ ఇస్తున్నారు. ఇందుకు వారు మద్దతు ధర కంటే తక్కువ చెల్లిస్తామని చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో మొహరించిన మధ్యవర్తులు రైతులకు గాలం వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
రైతులు వరిధాన్యంను విక్రయించేందుకు పడుతున్న అవస్థలను గ్రహించిన మధ్యవర్తులు..మిల్లర్ల తరపున వ్యాపారులు రంగ ప్రవేశం చేశారు. వరిధాన్యంను తక్షణమే కొనుగోలు చేస్తామని రైతులకు చెబుతున్నారు. క్వింటాలుకు రూ.1400 చెల్లిస్తామని పేర్కొంటున్నారు. ఇది మద్దతు ధర కంటే క్వింటాలుకు రూ.560 తక్కువ. మధ్యవర్తులు..కొందరు మిల్లర్లు రైతుల పరిస్థితిని ఆసరగా చేసుకొని కనిష్ట ధరలకు వరిధాన్యంను కొనుగోలు చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. అయితే రైతులు మాత్రం వారి ఆఫర్‌ను తిరస్కరిస్తున్నారు. మద్దతు ధరకు అటూఇటూగా చెల్లింపులు చేస్తే విక్రయిస్తామని స్పష్టం చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital