మేడ్చల్ – తెలంగాణ ఆగం ఆగం కావటానికి కేసీఆర్ పాలనే కారణమని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రత్యారోపణ చేశారు. మేడ్చల్ నియోజకవర్గం జవహర్ నగర్లో కాంగ్రెస్ విజయభేరీ సభలో ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనా, అక్కడ పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డిపైన ఆరోపణలతో దుమ్మెత్తి పోశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ ఆగం ఆగం అవుతుందని చెబుతున్నారని, కానీ నిజానికి కేసీఆర్ పదేళ్ల కాలంలోనే తెలంగాణ ఆగం ఆగం అయిందన్నారు.
పదేళ్లల్లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయలేదని, దీంతో ధాన్యం కుప్పలపైనే రైతులు బండలా పడుకున్నారని, తెలంగాణలో రైతుల మరణాలు, ఆత్మహత్యలు పెరిగి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పదేళ్లల్లో 83 వేల మంది రైతులు మరణించారని, వీరి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున బీమా పరిహారం చెల్లించినట్టు కేసీఆరే చెప్పారని, 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, మరి రైతులు ఆగం కాలేదా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 2 లక్షలకు పైగా ప్రభుత్వం ఉద్యోగాలు ఖాళీగా ఉంటే, పదేళ్లుగా సర్కారు ఉద్యోగాలను భర్తీ చేయక పోవటంతో.. 30 లక్షల మంది నిరుద్యోగులు అల్లాడిపోతున్నారని, ఇది తెలంగాణ ఆగం ఆగం కాదా? లక్షన్నర కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును కడితే మూడేళ్లకే మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం పగిలిపోవటం తెలంగాణ ఆగం ఆగం కాదా? తెలంగాణను కేసీఆరే ఆగం ఆగం చేశారని రేవంత్ రెడ్డి విమర్శలతో ప్రతిదాడి చేశారు.
ఇక మేడ్చల్ నియోజకవర్గంలో కేసీఆర్, మల్లారెడ్డి తోడు దొంగలుగా మారారని, ఈ ఎన్నికల్లో పార్టీ టిక్కట్లను మల్లారెడ్డి అమ్మేశారని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచులు, కార్పరేటర్లకు ఈయనే పార్టీ టిక్కెట్లను అమ్మితే… మరీ కేసీఆర్ ఎన్ని వందల కోట్లకు టిక్కెట్లు అమ్ముకున్నారో? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డితో కేసీఆర్ కలసి భూములను కొల్లగొడుతున్నారని , జవహర్ నగర్ పేదలు గుడిసెలు వేసుకుంటే అధికారులు కూల్చి వేస్తున్నారని, మరి మల్లారెడ్డి భూ కబ్జాలు వీరికి కనిపించటం లేదా? మల్లారెడ్డి గతి లేనోడా? రోడ్డు మీద పండుతున్నాడా? కీసర గుడిలో మెట్ల మీద అడుక్కుతింటున్నాడా? చెరువుల దగ్గర సికం భూముల్లో నాలుగు ఎకరాల భూమిని కొని 20 ఎకరాల చెరువును తవ్వేస్తున్నారని రేవంత్ రెడ్డి మండి పడ్డారు.
కేసీఆర్ మాత్రం వందల ఎకరాల్లో భూములు కొని ఐదు ఐటీ కంపెనీలకు ఇచ్చారని, మేడ్చల్‌లో ఒక్క ఐటీ కంపెనీకి భూమి ఇవ్వలేదని, దీంతో ఇక్కడ భూముల ధరలు పడిపోయాయని, ఇక జవహర్‌నగర్‌ను ఓ డంపింగ్ కేంద్రంగా మార్చేశారని, పేదోళ్లు నివసించే ప్రాంతాన్ని మురికి కూపంగా మార్చారని కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి దండెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జవహర్ నగర్ పేదలకు 250 గజాల ఇళ్లస్థలం ఇస్తామని, రూ.5లక్షల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళల ఖాతాలో రూ.2500లు జమ చేస్తామని, కళ్యాణ లక్ష్మీ పథకంలో లగ్గం కుదరగానే వదువు ఖాతాలో లక్ష రూపాయలు జమ చేయటమే కాదు తులం బంగారం ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు మంచి జరుగుతుందన్నారు.