Tuesday, November 26, 2024

ప్రతి రైతుకు న్యాయం చేస్తాం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారం : మండ‌ల కేంద్రమైన జిన్నారంలో సర్వే నెంబర్ 1 భూమి సేకరణ అంశంపై శనివారం పటాన్ చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైతులు, అధికారులతో ఎమ్మెల్యే జీఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. నూతన ప్రాజెక్టులు, పరిశ్రమలు ఏర్పాటు అయ్యే తరుణంలో భూ సేకరణ చేయడం అత్యంత సహజమని తెలిపారు. ఈ నేపథ్యంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం చట్ట ప్రకారం పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందించడంతోపాటు వారికి అండగా నిలుస్తోందని అన్నారు. సర్వేనెంబర్ 1 లో గల అసైన్డ్ పట్టా గలిగిన రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగబోదని తెలిపారు. హెచ్ఎండీఏకు పూర్తి స్థాయిలో భూములు అప్పగించిన రైతులకు, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చేపట్టబోయే లే అవుట్ లో 600 గజాల స్థలాన్ని పూర్తిస్థాయి యాజమాన్య హక్కులతో రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. క్రయ విక్రయాలు చేసుకునే అధికారం సైతం కల్పించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా భూమికి బదులు భూమి కోరుతున్న రైతులకు అదే సర్వే నంబర్లు భూమిని కేటాయించాలని రైతులు విజ్ఞప్తి చేయగా, ఇందుకు ఎమ్మెల్యే జీఎంఆర్ సానుకూలంగా స్పందించి ఆ దిశలో పరిష్కారం చూపనున్నట్లు తెలిపారు. భూ సేకరణ అంశంలో రైతులు అయోమయానికి గురికావద్దని, ప్రతి రైతుకు న్యాయం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం స్థానిక ప్రజా ప్రతినిధులు పనిచేస్తున్నారని సూచించారు. నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు అయితే స్థానికంగా భూమి విలువలు పెరగడంతోపాటు యువతకి ఉపాధి అవకాశాలు విరివిగా లభిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు వెలిబుచ్చిన పలు ప్రశ్నలకు అధికారులు సమాధానం ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఆర్డిఓ నగేష్, ఎమ్మార్వో దశరథ్ సింగ్, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement