పటాన్చెరు : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని, 18 సంవత్సరాల వయసు నిండిన యువతి యువకులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని డిఎస్పీ కార్యాలయం ఎదుట నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారతదేశం అన్నారు. ఓటు హక్కు పవిత్రమైనదని పరిపాలనా విధానానికి ఆయుధం లాంటిదని అన్నారు. యువ ఓటర్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రతి ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్నారని తెలిపారు. దేశ, రాష్ట్ర చట్టసభల్లో, స్థానిక స్వపరిపాలన సంస్థలలో అనేక విప్లవాత్మకమైన మార్పులకు ఓటు హక్కు నాంది పలికిందన్నారు. ఓటరు విజ్ఞతతోనే ప్రజాస్వామ్య ప్రగతి, దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో 18 సంవత్సరాలు వయసు ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, తహసిల్దార్ పరమేశం, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వివిధ కళాశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement