Tuesday, November 19, 2024

అంకుల్ మీ డ‌బ్బులు కింద ప‌డ్డాయంటూ న‌మ్మించి… ఆపై న‌గ‌దుతో ఉడాయించారు…

రామచంద్రాపురం : అంకుల్‌ మీ జేబులో నుంచి డబ్బులు కింద పడ్డాయని మాయమాటలు చెప్పి బైక్‌కు ఉన్న 55వేల రూపాయల సంచితో దుండగులు ఉడాయించిన సంఘటన రామచంద్రాపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలివి. భారతినగర్‌ డివిజన్‌ పరిధిలోని ఎంఐజీ కాలనీ 2015 నెంబర్‌ గల క్వార్టర్‌లో నివాసముంటున్న మహ్మద్‌ రిజ్వానుద్దీన్‌ బీహెచ్‌ఇయల్‌లో పనిచేసి రిటైర్డ్‌ అయ్యారు. ఇంట్లో వివిధ పనుల నిమిత్తం డబ్బులు అవసరమవ్వడంతో గురువారం మధ్యాహ్న సమయంలో తన స్కూటిపై ఇంటి నుంచి బయలుదేరి బీహెచ్‌ఇయల్‌లోని ఎస్‌బీహెచ్‌ బ్యాంక్‌కు వచ్చాడు. బ్యాంకులో రూ.55 వేల నగదును డ్రా చేశాడు. డ్రా చేసిన 55 వేల రూపాయల నగదు సంచిని తన స్కూటీ డిక్కిలో పెట్టుకోకుండా ముందు భాగంలో కొక్కానికి పెట్టుకున్నాడు. డబ్బులు తీసుకువెళ్లేందు కోసం బ్యాంక్‌కు వచ్చిన రిజ్వానుద్దీన్‌ను అక్కడే ఉండి గమనిస్తున్న గుర్తుతెలియని వ్యక్తులు అతని వెనకాలే మరో వాహనంపై అనుసరించారు.

బీహెచ్‌ఇయల్‌లోని పెట్రోల్ బంక్‌లో పెట్రోల్‌ పోసుకుని ఇంటికి వెళ్లామని రిజ్వానుద్దీన్‌ బంక్‌ వైపు దారిలో వెళ్తున్నాడు. సరిగ్గా హయ్యర్ సెకండరీ స్కూల్ వద్దకు ఆయన చేరుకోగానే మోటార్‌బైక్‌పై వెంబడిస్తున్న గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు తమ వద్ద ఉన్న 10, 20 రూపాయల నోట్లను రోడ్డుపై పడేసి రిజ్వానుద్దీన్‌ వద్దకు చేరుకుని అంకుల్ మీ జేబులో నుంచి డబ్బులు పడిపోయాయని చెప్పారు. స్కూటీని ఆపి వెనకకి తిరిగి చూడగా రోడ్డుపై పది రూపాయల నోటు, ఇరవై రూపాయల నోటు పడి ఉన్నాయి. దీంతో రిజ్వానుద్దీన్ స్కూటిని పక్కకు ఆపి కింద పడిన డబ్బులను తీసుకోవడానికి వెళ్లాడు. అంతే ఇద్దరు అగంతకులు రిజ్వానుద్దీన్‌ స్కూటికి ముందు బాగాన తగిల్చిన డబ్బుల సంచిని తీసుకుని ఉడాయించారు. వారు డబ్బు తీసుకుని పారిపోవడాన్ని చూసిన రిజ్వానుద్దీన్‌ వారిని వెంబడించే ప్రయత్నంలో స్కూటి పై నుంచి కింద పడ్డాడు. దీంతో ఆయన తలకు గాయమైంది. వెంటనే రామచంద్రాపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement