జిన్నారం : మనం వెళ్లే రోడ్డులో ఏదైనా గుడ్డు, నిమ్మకాయ కనిపిస్తే వాటికి దూరంగా నడుస్తాం.. అలాంటిది ఏకాంగా ఒక తల లేని దున్నపోతు మొండెం దారిలో కనిపిస్తే అటువైపు మచ్చుకైనా కన్నెత్తి చూడకుండా వేరే మార్గాలను ఎంచుకుంటాం.. కాలం మారుతుంది.. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నాం.. అయినా కొన్ని ప్రాంతాల్లో మూడనమ్మకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.. దోష నివారణ, గ్రామాలకు పట్టిన దుర్గతి పోవాలంటే జంతు బలి ఇవ్వాలని మాత్రికులు చెపుతుంటారు.. కొందరైతే ఏకంగా మానవ బలి ఇస్తే మరింత మేలు జరుగుతుందని సూచిస్తారు.. ఇవి నమ్మిన కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల నరబలికి పాల్పడుతున్న సంఘటనలు మనం చూస్తేనే ఉన్నాం..
అసలు విషయమేమిటంటే.. బొల్లారం మున్సిపాలిటిలో తల లేని దున్నపోతు మొండెం కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. బొల్లారంలో క్షుద్రపూజలు జరుగుతున్నాయనే ప్రచారంతో ప్రజలు జంకుతున్నారు. ఎక్కడో క్షుద్ర పూజలు చేసి దున్నపోతు కాళ్లు కట్టేసి తలను నరికి వేసి మొండెం తీసుకొచ్చి బొల్లారం ఐటీసీ పరిశ్రమ ముందు వేశారు. దున్నపోతు మొండెం చూసి రోడ్డున పోయే జనాలు భయాందోలన చెందుతున్నారు. దున్నపోతు తలను క్షుద్ర పూజలకు వాడి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో క్షుద్ర పూజలు జరుగుతున్నాయానే అనుమానంతో ప్రజలు జంకుతున్నారు. విషయం తెలిసినప్పటి నుంచి అటూ వైపుకు వెళ్లడానికే ప్రజలు వణుకుతున్నారు. ఉదయం నుంచి ఈ విషయం పై బొల్లారంలో చర్చనీయాంశమైంది.