Friday, November 22, 2024

జాతీయ సమైక్యత స్ఫూర్తితో జాతి సమగ్రతను కాపాడుతూ.. ఐక్యంగా ముందుకు సాగాలి : హోం మంత్రి మహమూద్ అలీ

సంగారెడ్డి : జాతీయ సమైక్యత దినోత్సవ స్ఫూర్తితో జాతి సమగ్రతను కాపాడుతూ అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ పిలుపు నిచ్చారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని మంత్రి సంగారెడ్డి లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకావిష్కరణ గావించి, పోలీస్ వందనాన్ని స్వీకరించారు. జిల్లా ప్రజలందరికీ తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్రంగ అవతరించి అన్ని రంగాల్లో అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తూ కొద్దికాలంలోనే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలిచిందన్నారు. జాతీయ సమైక్యత దినోత్సవ స్ఫూర్తితో జాతి సమగ్రతను నిలబెట్టుకుంటూ ప్రజలందరూ ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా అభివృద్ధిని సంక్షిప్తంగా వివరించారు. అనంతరం మెప్మా ద్వారా 84 స్వయం సహాయక సంఘాలకు రూ.7.50 కోట్ల బ్యాంక్ లింకేజీ, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా 902 స్వయం సహాయక సంఘాలకు రూ.55.25 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజీ జంబో చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. దళిత బందు పథకంలో లబ్ధిదారులకు జెసిబి, ఆటో ట్రాలీ, ఆటోలు, ట్రాక్టర్, బొలెరో వాహనం, గూడ్స్ వాహనాలను మంత్రి అందజేశారు. అంతకుముందు వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ వేడుకలలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి,తెలంగాణ చేనేత, హ్యాండ్లూమ్స్ చైర్మన్ చింతా ప్రభాకర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ లతా విజయేందర్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, గ్రంథాలయ చైర్మన్ నరహరి రెడ్డి, జిల్లా అధికారులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement