జిన్నారం : అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఇందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డుల్లో 38% తెలంగాణకే దక్కాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జిన్నారం మండల పరిధిలోని అండూరు, మంగంపేట్, సోలక్పల్లి జిన్నారం, జంగం పేట్, వావిలాల, ఖాజిపల్లి, నల్తూరు కొడకంచి, మాదారం గ్రామాల్లో 2 కోట్ల 5 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. నల్తూరు గ్రామంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి పథకం గ్రామాల రూప రేఖలను మార్చిందని తెలిపారు. ప్రతి గ్రామంలో సిసి రోడ్లు, అంతర్గత డ్రైనేజీలు, వీధి దీపాలు, నర్సరీలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, ట్రాక్టర్లు అందించడం జరిగిందని తెలిపారు. పరిశుభ్రత పచ్చదనానికి పెద్ద పీట వేస్తూ పెద్ద ఎత్తున మొక్కల పెంపకం చేపడుతున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందిస్తూ తాగునీటి కొరతను అధిగమించడం జరిగిందని తెలిపారు. 24 గంటల పాటు నాణ్యమైన కరెంటును అందిస్తూ ప్రగతి పథంలో ముందుకు తీసుకొని వెళుతున్నామని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రైతులు తమ ధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని విజ్ఞప్తి చేశారు. ఖాజిపల్లి గ్రామంలో జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సౌజన్యంతో త్వరలోనే మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజేష్, నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.