మెదక్ ప్రతినిధి, ఏప్రిల్ 24(ప్రభ న్యూస్): దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్న.. జీవితాంతం ప్రజాసేవలో ఉంటానని బిఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. బుధవారం మెదక్ బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తన నామినేషన్ పత్రాలను జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్‌కు సమర్పించారు. అనంతరం అయన విలేకర్లతో మాట్లాడారు.
రెండు సెట్లు నామినేషన్ పత్రాలు దాఖలు చేశామన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు, జిల్లా ఎమ్మెల్యేలు, అశేష అభిమానుల మధ్య గురువారం దాఖలు చేస్తామన్నారు. ఒక్క నిమిషం ఆలోచించి ఓటు వేయాలని కోరారు.కాంగ్రెస్ తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. బాండ్ పేపర్ ను చెల్లని కాగితంగా చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఏద్దేవా చేశారు.రైతులను దుఃఖ సాగరంలో నింపింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. బిజెపి అభ్యర్థి రఘునందన్ ప్రజలను మోసం చేశారన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. నాగలి, ఎడ్లు, నిరుద్యోగ భృతి అని మోసం చేశారన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడగటానికి వస్తున్నారని విమర్శించారు.
బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాకలో 54 వేల ఓట్లతో ఘోర పరాజయం పొందారని, దుబ్బాకలో చెల్లని రూపాయి మిగతా నియోజవర్గల్లో ఎలా చెల్లుతుందని ఏద్దేవా చేశారు. ప్రజల అధికారిగా ఉన్నా. మరింత సేవ చేసేలా ఎంపీగా వస్తున్నానన్నారు.ముగ్గురు అభ్యర్థుల గుణగణాలు చూసి ఓటు వేయాలని వెంకట్రామి రెడ్డి కోరారు.కలెక్టర్ గా ఇక్కడ పని చేశా, ఎంపీగా పోటీ చేస్తున్నానన్నారు.మీ అందరూ ఆదరిస్తారని కోరుతున్నానని, జీవితాంతం మీ సేవలో ఉంటానన్నారు.ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద పిల్లలకు విద్య అందిస్తానందిస్తానని,ఫంక్షన్ హాల్లు నిర్మించి ఉచితంగా సదుపాయం కల్పస్తానన్నారు.
కాంగ్రెస్ తగిన బుద్ది చెప్పాలి…
కాంగ్రెస్ అబద్ధాలను ప్రజలు గుర్తించారని,అందుకే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పబోతున్నారని జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. బిజెపి, కాంగ్రెస్ రెండు దొందూ దొందేనని,తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశాయన్నారు. కాంగ్రెస్ హామీలు ఇచ్చి మోసం చేశారని, మొన్న ఇక్కడకు వచ్చి ప్రగల్భాలు పలికి వెళ్ళారన్నారు. వచ్చే ఎన్నికల్లో మెదక్ బిఆర్ఎస్ జెండా ఎగురబోతుందని దీమా వ్యక్తం చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ మాట్లాడుతూ మంచి వ్యక్తిని కేసీఆర్ మెదక్ ఎంపీ అభ్యర్థి గా ఎంపిక చేశారన్నారు. కొందరు మతంతో, కొందరు కులంతో వస్తున్నారని ఓటర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామి రెడ్డి మంచితనంతో వస్తున్నారన్నారు. మంచి మెజారిటీతో గెలవబోతున్నారని దీమా వ్యక్తం చేశారు. కులం మధ్య, మతం మధ్య లొల్లి పెడితే తెలంగాణలో నడువదన్నారు.ఈ కార్యక్రమం ల్లో ఎమ్మెల్యే లు చింత ప్రభాకర్, సునీత లక్ష్మా రెడ్డి, మెదక్ జడ్పి చైర్ పర్సన్ హేమలత తదితరులు పాల్గొన్నారు.