సిద్దిపేట ప్రతినిధి, ఆగస్టు 9(ప్రభన్యూస్) : రిజర్వాయర్లకు ఖిల్లా సిద్ధిపేట అని రాష్ట్ర ఆర్థిక, వైద్యా, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం తోర్నాలలో రూ.48 కోట్లతో చేపట్టిన తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల మహిళా వ్యవసాయ డిగ్రీ కళాశాల నిర్మాణానికి టీఎస్ఈడబ్ల్యుఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… నాలుగేళ్లుగా బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాల కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. సంపూర్ణ మెడికల్, వెటర్నరీ, అగ్రికల్చర్ ఇనిస్టిట్యూట్ సిద్దిపేటలో తెచ్చుకున్నామని, సెప్టెంబర్ 13న బీ ఫార్మసీ కళాశాల ప్రారంభించుకుంటామని, అన్నిరకాల చదువులు ఆలయాలు, రిజర్వాయర్లకు ఖిల్లా అయిన సిద్దిపేటను చదువులకు సైతం నిలయంగా మార్చుకున్నామని వెల్లడించారు. ఒకప్పుడు చుక్కనీరు లేని ప్రాంతాన్ని రిజర్వాయర్ల ఖిల్లాగా మార్చుకున్నామని, తెలంగాణ రాక ముందు ఒక్కటి లేని రెసిడెన్షియల్ కాలేజీలు నేడు 80 ఏర్పాటు చేసుకున్నామన్నారు.
ఉమ్మడి జిల్లాలో తెలంగాణ రాక ముందు 682 మాత్రమే ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్, నేడు 1012 స్కూల్స్ ఏర్పాటు చేసుకున్నామని, తెలంగాణ రాక ముందు లక్షా 94వేల మంది విద్యార్థులు చదివితే, నేడు 7.50 వేల మంది విద్యార్థులు చదువుకున్నారన్నారు. గత ప్రభుత్వాలు ఒక్కటంటే ఒక్క డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయలేదని, సద్దితిన్న రేవు తలవాలి, చదువుకుంటున్న విద్యార్థులు మీ పేరెంట్స్ కు తెలపాలపారు. 2014కు ముందు రెసిడెన్షియల్ విద్యపై పెట్టిన ఖర్చు రూ.970 కోట్లు, నేడు రూ.4000 కోట్లు ఖర్చు పెడుతున్నామని, రెండు, మూడు రోజుల్లో బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఏర్పాటు చేసుకోబోతున్నామన్నారు. ప్రభుత్వం పని ఎక్కువ చేస్తున్నది, చెప్పుకునేది తక్కువ ఉందన్నారు. నిజాలు ప్రజలకు తెలవాలి, ఇంత మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.
ఒకప్పుడు పంజాబ్ ఇప్పుడు మనమే…
ఒకప్పుడు పంజాబ్ వరి ధాన్యంలో మొదటి స్థానంలో ఉంటే నేడు తెలంగాణ నెంబర్ వన్ గా మారిందన్నారు. డాక్టర్ల ఉత్పత్తిలోనూ దేశంలో నెంబర్ వన్ గా మారిందని తెలిపారు. డబ్ల్యు హెచ్ ఓ నామ్స్ ప్రకారం ప్రతి వెయ్యి మందికి ఒక డాక్టర్ ఉండాలి, తెలంగాణలోని ఇప్పుడు 40 వేల మంది డాక్టర్లు ఉన్నారన్నారు. ప్రపంచంలో ఎన్నో దేశాల నుంచి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటున్నారన్నారు. ఇండియాలో ఎక్కువగా ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్స్ హైదరాబాద్ లో జరుగుతున్నాయని, చంద్రబాబుకు ఎప్పుడూ మనమీద ప్రేమ ఉండదు కానీ, మొన్న చంద్రబాబు తెలంగాణా భూములపై పాజిటివ్ గా మాట్లాడారని చెప్పారు. ఒకప్పుడు ఆంధ్రలో ఎకరం భూమి అమ్ముకుంటే తెలంగాణలో ఐదు ఎకరాలు దొరికేది, నేడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో ఐదు ఎకరాలు దొరికే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారన్నారు.