కోహెడ, జులై 23( ప్రభ న్యూస్): ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలను పరిష్కరిస్తామని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి అన్నారు. మంగళవారం జిల్లా పరిధి కోహెడ, బెజ్జంకి మండలాల్లో కలెక్టర్ మను చౌదరి పర్యటించారు. కోహెడలోని శనిగరం పాఠశాల, బెజ్జంకి లోని మండలం పోతారం మండల ప్రాథమిక పాఠశాలను పరిశీలించి అక్కడ నెలకొన్న సమస్యలను పాఠశాల ప్రిన్సిపల్, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 15 ఏళ్లుగా మూతపడి పాఠశాలల్లో మళ్లీ విద్యార్థులను చేర్పించినందుకు విద్యాశాఖ అధికారులను, గ్రామస్తులను జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాలకు అవసరమైన త్రాగునీరు, విద్యుత్ కనెక్షన్, మరుగుదొడ్లు, కాంపౌండ్ వాల్ గెట్, పాఠశాలకు అవసరమైన రిపేర్లను పూర్తి చేయిస్తానని, అవసరమైన ఫర్నీచర్ ఏర్పాటు చేయిస్తానని.. నాణ్యమైన విద్యను అందించే ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని కలెక్టర్ మను చౌదరి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మండల అధికారి మహతి లక్ష్మి, విద్యాశాఖ సెక్టార్ల అధికారులు రామస్వామి, రంగనాథ్, కమ్యూనిటీ నోబలైజర్ పద్మయ్య పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.