Tuesday, November 26, 2024

ఫైనల్ స్టేజ్ లో వరి పంట.. కోతలకు ఖర్చుల భారం..

పాపన్నపేట, (ప్రభ న్యూస్‌) : జిల్లాలో గతేడాది వానాకాలంలో 1.20 లక్షలు ఎకరాలు, ఈసారి 1.36 లక్షలు ఎకరాలో వరి సాగైంది. గతేడాదితో పోలిస్తే ఈ సారి ఎరువుల ధరలు, కూలీల రేట్లు పెరగడంతో పెట్టుబడి అధికమైంది. వీటికి తోడు రోజు రోజుకు పెరుగుతున్న డీజిల్‌ ధరలు అన్నదాతలకు గుదిబండగా మారుతున్నాయి. గతేడాది మే నెలలో లీటర్‌ డీజిల్‌ రూ.67 ఉండగా.. ప్రస్తుతం 106.90కి చేరింది. ఏడాదిన్నర కాలంలో డీజిల్‌ ఒక్క లీటర్‌పై రూ.38 వరకు పెరిగింది. సాగులో ట్రాక్టర్లు, టిల్లర్లు, హార్వెస్టర్లు ఇతర యంత్ర పరికరాలను వినియోగిస్తుండడంతో పెరిగిన ధరలు వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ట్రాక్టర్‌ యజమానులు పొలం దున్నేందుకు ఎకరాకు రూ.3,000 నుంచి రూ.4,500 వేల వరకు పెంచారు. దీంతో ఎకరాకు రూ.1000 వరకు రైతులపై అదనపు భారం పడుతోంది. కూలీల కొరత తీవ్రం కావడంతో రైతులు వరి కోతలకు పూర్తిగా హార్వెస్టర్లపైనే ఆధారపడ్డారు. ప్రస్తుతం జిల్లాలో వరికోతలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో హార్వెస్టర్ల యజమానులు సైతం కోతల రేట్లను పెంచకతప్పని పరిస్థితి నెలకొంది. గతేడాది వరి పంట కోసేందుకు గంటకు రూ.2,000 నుంచి రూ.2,200 వరకు వసూలు చేయగా.. ఈ సారి రూ.2,600 నుంచి రూ.3,000 వరకు పెంచారు. దీంతో ఎకరాకు రూ.1200 వరకు అదనపు భారం పడుతోంది. కోసిన ధాన్యాన్ని ట్రాక్టర్లలో కల్లాలు, కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు మరింత సొమ్ము అదనంగా వెచ్చించాల్సివస్తోంది.

అద్దెలు ఇలా (రూపాయలలో)..

ట్రాక్టర్‌ దుక్కి దున్నడానికి గతేడాది రూ.800-1,000, చదును చేయడం 700-800లు, ధాన్యం రవాణా (ట్రిప్పునకు) రూ.400లు కాగా ఈ సారి దుక్కి దున్నడానికి ట్రాక్టర్‌కు రూ.1,600- 2,200, చదును చేయడం కోసం రూ.1,400-1,600లు కాగా ధాన్యం రవాణా (ట్రిప్పునకు) రూ.1400 వసూలు చేస్తున్నారు. కోత కోసేందుకు హార్వెస్టర్‌ గంటకు గతేడాది రూ.2,000-2,200 ఉండగా ఈ సారి గంటకు రూ.2,600- 3,000 వరకు వసూలు చేస్తున్నారు. వరినాటు కూలీ రోజుకు గతేడాది రూ.400 ఉండగా, ఈ సారి రూ.550 చెల్లిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement