కౌడిపల్లి, మే 30 (ప్రభ న్యూస్) : జిల్లా వ్యాప్తంగా బుధవారం రోజు వరకు రెండు లక్షల 60 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గురువారం మండల పరిధిలోని వెల్మకన్నె గ్రామంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. తేమశాతాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ రాహుల్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ…. జిల్లాలో రెండు లక్షల 60వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించడం జరిగిందన్నారు. గత సంవత్సరానికి పోల్చుకుంటే 70వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అదనంగా కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే 300 కొనుగోలు సెంటర్లను క్లోజ్ చేయడం జరిగిందని 100 సెంటర్లు మాత్రమే కొనసాగుతున్నాయని, రెండు మూడు రోజుల్లో మిగిలిన సెంటర్లు కూడా ధాన్యాన్ని కొనుగోలు చేసి మూసి వేయడం జరుగుతుందన్నారు.
పచ్చి రొట్టె విత్తనాల కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జిల్లాకు సంపూర్తిగా విత్తనాలను సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే నాలుగు వేల క్వింటాళ్ల జీలుగ విత్తనాలను సరఫరా చేయడం జరిగిందన్నారు. ధాన్యం డబ్బులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. రెండు మూడు రోజుల వరకు వర్ష సూచన లేదన్నారు. రైతులెవరు కూడా ఆందోళన చెందకూడదని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం నాక్సన్ పల్లిలోని డీసీఎంఎస్ జీలుగ విత్తనాల విక్రయ దుకాణాన్ని తునికి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. కలెక్టర్ వెంట మండల తహసీల్దార్ ఆంజనేయులు, ఏడీఏ పుణ్యవతి, మండల విద్యాధికారి బుచ్చనాయక్, ఆర్ఐ శ్రీహరి, వ్యవసాయ అధికారి స్వప్న, విస్తరణ అధికారి రాజశేఖర్ గౌడ్, తదితరులున్నారు.