మెదక్ : ప్రస్తుత కరోనా నేపథ్యంలో ప్రవేట్ పాఠశాలలు మూతపడి ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు, సిబ్బంది ఆర్థిక సంక్షోభం అనుభవిస్తున్నారని, వారిని మళ్లీ పాఠశాలలు తెరిచేదాక ఆర్థిక సహాయంతో పాటు ఉచితంగా బియ్యం అందించి ఆదుకోవాలని ప్రభుత్వం మానవీయ కోణంలో నిర్ణయం తీసుకుందని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంత్రులు ఇద్దరూ బీఆర్కె భవన్ నుండి ప్రభుత్వ ప్రధాన సలహదారు రాజీవ్‌శర్మతో కలిసి జిల్లా కలెక్టర్లతో పాటు జిల్లా విద్యాశాఖాధికారులు, జిల్లా పౌరసరఫరాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా దెబ్బకు ఆర్థికంగా విలవిలలాడుతున్న రాష్ట్రంలోని ప్రవేట్ పాఠశాలలోని ఉపాధ్యాయులు, సిబ్బందికి ప్రతి ఒక్కరికి ఈ నెల నుండే రెండు వేల రూపాయల నగదుతో పాటు 25కిలోల బియ్యం రేషన్ షాపుల ద్వారా ఉచితంగా అందించాలని నిర్ణయించిందని అన్నారు. ఇందుకు సంబంధించి ఆయా జిల్లాలో గుర్తింపు పొందిన ప్రవేట్ పాఠశాలలు, అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది డేటా వివరాలను ఈ నెల 15లోగా సేకరించి ఏప్రిల్ 28వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో నమోదుచేయాలని మంత్రి కలెక్టర్లకు సూచించారు. ఇందుకు సంబంధించి విధి విధానాలను, కార్యాచరణ ప్రణాళి అమలు కోసం ఆదేశాలు జారీ చేశామని వారు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ యస్.హరీష్ మాట్లాడుతూ జిల్లాలో గత మార్చి నాటికి గుర్తింపు పొందిన ప్రవేట్ పాఠశాలలు 110 ఉన్నాయని అందులో 1124 మంది భోదన, బోదనేతర సిబ్బంది ఉన్నారని మంత్రులకు వివరించారు. కాన్ఫరెన్స్‌లో చెప్పిన ఆదేశాలను ఖచ్చితంగా పాటిస్తూ సోమవారం లోగా పూర్తి వివరాలు అందించవలసిందిగా ఆయన మండల విద్యాశాఖాధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి చిత్రారామచంద్రన్, జిల్లా విద్యాశాఖాధికారి రమేష్, జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనివాస్, వివిధ మండలాల విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement