సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం వడ్డేపల్లి గ్రామ శివారులో నిర్మించబోయే సురభి లాబరేటరీస్ పరిశ్రమ నిర్మాణాన్ని వెంటనే ఆపివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కంపెనీ ఇక్కడ నిర్మించొద్దని పలు గ్రామాల ప్రజలు ఎనిమిది రోజులుగా ధర్నా, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ పరిశ్రమ ఏర్పాటైతే వేల ఎకరాల వ్యవసాయ భూములు, తాగునీరు కలుషితమై ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టరేట్ వద్ద గ్రామస్తులు ప్లే కార్డులు చేతబూని నిరసన చేపట్టారు. వీరికి స్థానిక ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నాయకులు సైతం మద్దతుగా నిలిచారు.
– ప్రభ న్యూస్ బ్యూరో, ఉమ్మడి మెదక్/సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం వడ్డేపల్లి గ్రామ శివారులోని సురభి లాబరేటరీస్‌కి చెందిన కెమికల్ పరిశ్రమ ఏర్పాటు-ను వ్యతిరేకిస్తూ వివిధ గ్రామాల ప్రజలు రైతులు ఆందోళన ఉధృతం చేశారు. కాలుష్యకారక పరిశ్రమను ఏర్పాటు చేయవద్దని 8 రోజులుగా నిరసనను కొనసాగిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు సైతం నిరసన తెలపడంతో ఆందోళన కార్యక్రమాలకు మండల ప్రజా ప్రజాప్రతినిధులు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసన కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. కాలుష్య కారక పరిశ్రమ ఏర్పాటు చేయొద్దని తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. పరిశ్రమ నిర్మాణాలను నిలుపుదల చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని మండలంలోని వివిధ గ్రామాలకి చెందిన ప్రజా ప్రతినిధులు, రైతులు ముక్తకంఠంతో ప్రకటించారు. కెమికల్ పరిశ్రమల ఏర్పాటు వ్యవహారం ఆరు గ్రామాలకు తీరని నష్టాన్ని మిగిల్చే అవకాశం ఉందని వారు వాపోతున్నారు. తమ గ్రామాల పరిధిలో పరిశ్రమ పెడితే వేల ఎకరాల్లో పంటలు పండడం కష్టమేనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటు-ను విరమించుకోవాలని ఎనిమిది రోజులుగా ఆ గ్రామాల రైతులు నిరసన దీక్షలు చేస్తుండగా అధికార పార్టీకి చెందిన నాయకులు, ఎమ్మెల్యే కూడా మద్దతు పలికారు. ఎవరూ వెనక్కితగ్గొద్దు, డబ్బులకు లొంగవద్దు అంటూ స్వయంగా ఎమ్మెల్యేనే దీక్షలో పాల్గొని సూచనలు చేయడం చర్చనీయాంశమైంది. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం వడ్డేపల్లి, ఎల్లమ్మగూడ శివారులో 13 ఎకరాల్లో సురభి ల్యాబోరేటరీస్ కెమికల్ పరిశ్రమలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. హెచ్‌ఎండీఏ, టీ-ఎస్‌ఐపాస్, పీసీబీల నుంచి అనుమతులు తీసుకుని పరిశ్రమ నిర్మాణ పనులు మొదలుపెట్టారు.
నాయకుల మద్దతు..
టీఎస్‌ఐ పాస్, హెచ్‌ఎండీఏ, పీసీబీలు అనుమతులు ఇవ్వడం అధికార పార్టీ నేతలే ఆందోళన చేపట్టడాన్ని చూస్తే స్థానికులు, రైతులు విస్తుపోతున్నారు. హత్నూర మండలం ఎల్లమ్మగూడ, వడ్డేపల్లి గ్రామాల శివారులో నిర్మాణంలో ఉన్న సురభీ లాబోరేటరీస్ పరిశ్రమ వ్యవహారం తీవ్ర చర్చకు దారితీస్తున్నది. ఇప్పటకే 50 శాతం వరకు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. తమ పరిశ్రమలో ఎలాంటి పొల్యూషన్ ఉండదని, రియాక్టర్లు అసలే ఉండవని కంపెనీ ప్రతినిధులు చెప్పుకుంటున్నారు. అయినప్పటికీ పరిశ్రమ నిర్మాణం కొనసాగుతుండగా ఒక్కసారిగా పరిసర ప్రాంత గ్రామాల రైతుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. పరిశ్రమకు ప్రభుత్వ రంగ సంస్థలు అనుమతులు ఇవ్వగా అధికార పార్టీ ఆందోళన చేపట్టడం చర్చనీయాంశమవుతున్నది. స్వయంగా ఎమ్మెల్యే, ఇతర బీఆర్‌ఎస్ నాయకులు వచ్చి రైతులో కలిసి ఆందోళన చేయడం కంటే మంత్రులు వద్దకు వెళ్లి పరిస్థితి వివరించవచ్చు కదా..? అని కాంగ్రెస్‌కు చెందిన ఓ నాయకుడు ఆరోపించారు. కాలుష్య కారక పరిశ్రమలకు ఎందుకు అనుమతి ఇచ్చారు..? ఇచ్చింది ఎవరు..? అని ఆ నాయకుడు సూటిగా ప్రశ్నించారు. స్వయంగా ఎమ్మెల్యేనే రైతుల ఆందోళనకు మద్దతు చెబుతున్నారంటే మరి తప్పు చేస్తున్నది ఎవరని నిలదీస్తున్నారు. ఎమ్మెల్యే మద్దతు ఇచ్చే బదులుగా నిర్మాణ పనులను ఆపివేయించాలని సదరు గ్రామాల రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఓట్ల రాజకీయం కోసం బీఆర్‌ఎస్ నేతలు రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటిస్తూ మరో పక్క పరిశ్రమ నిర్మాణానికి కూడా ఒకే చెబుతున్నారని పలువురు ప్రతిపక్ష పార్టీల నాయకులు, ఆయా గ్రామాల రైతులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ వ్యవహారం చర్చకు దారితీస్తోంది. ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
నిరసనలు ఉధృతం..
హత్నూర మండలం వడ్డేపల్లి గ్రామ శివారులోని సురభి లాబరేటరీస్‌కి చెందిన కెమికల్ పరిశ్రమ ఏర్పాటు-ను వ్యతిరేకిస్తూ వివిధ గ్రామాల ప్రజలు, రైతులు ఆందోళన ఉధృతం చేశారు. ప్రజా ప్రతినిధులు నిరసన పెద్దఎత్తున సంగారెడ్డి కలెక్టరేట్‌కు తరలివచ్చారు. కలెక్టరేట్ వద్ద ప్లే కార్డులు చేతబూని నిరసన తెలిపారు. దీంతో కలెక్టరేట్ వద్ద ఆందోళన వాతావరణం నెలకొంది. సురభి పరిశ్రమ మాకొద్దు అంటే మాకొద్దు అంటూ నినాదాలు చేశారు. అనంతరం హత్నూర మండల ప్రజా ప్రతినిధులు కలెక్టరేట్ వద్దకు వెళ్లి మెమొరాండం అందజేశారు. ఇప్పటి-కై-నా మా గ్రామాల కష్టాలను దృష్టిలో ఉంచుకొని మాకు పరిశ్రమను అక్కడి నుండి ఎత్తి వేసే విధంగా చర్యలు తీసుకొని తగు న్యాయం చెయ్యాలని వారు కోరుకున్నారు.
ఐదు వేల ఎకరాల్లో పంటలు నష్టపోతాం : అంబటి భాస్కర్, గ్రామం చింతల్ చెరువు
పరిశ్రమల ఏర్పాటు-తో తమ పంటలకు తీవ్రనష్టం వాటిల్లనుందని ఆరు గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. ఎల్లమ్మగూడెం, వడ్డేపల్లి, సాదులనగర్, కోణంపేట, కొడిప్యాక, ముచ్చర్ల గ్రామాల్లోని దాదాపు ఐదు వేల ఎకరాల్లో పంటలకు నష్టం జరగనుదంటు-న్నారు. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ జలాలు, కాలుష్యంతో ఈ ప్రాంతమే ఆగమవుతుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే పరిశ్రమ అనుమతి రద్దు చేయాలి. ఇక్కడి నుంచి తరలించాలని ఆరు గ్రామాల రైతులు ఆరు రోజులుగా దీక్ష చేస్తున్నారు. రోజువారీగా ఆయా గ్రామాల ప్రజలు వచ్చి దీక్షలో కూర్చుకుంటు-న్నారు.
రైతులకు బీఆర్‌ఎస్ మద్దతు – కృష్ణ, మాజీ సర్పంచ్, షాదుల్లా నగర్
టెంట్ వేసుకుని గత ఎనిమిది రోజులుగా చేస్తున్న నిరసన దీక్షకు స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించడం సంతోషం. తమ సంపూర్ణ మద్దతు ఉంటు-ందని, అయితే ఎవరూ కూడా పరిశ్రమల యాజమాన్యాలు చూపించే డబ్బుకు ఆశపడవద్దని, ప్రలోభాలకు లొంగకుండా ఇదే నిరసన తెలపాలని తన సంఘీభావం పలికారు. సీఎం, మంత్రి కేటీ-ఆర్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళతానని, కలిసికట్టుగా ఆందోళన కొనసాగించాలని స్వయంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆయా గ్రామస్తులకు సూచించారు. బీఆర్‌ఎస్ పార్టీయే మద్దతు ఇస్తుండగా.. కొందరు ఇతర పార్టీ నేతలు ఇది రాజకీయం చేయడం సరి కాదన్నారు. సురభి లాబరేటరీ కంపెనీ అనుమతులు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అకస్మాత్తుగా పంట పొలాల్లో పరిశ్రమలు నెలకొల్పడం దారుణం : ధనలక్ష్మి, ఖానంపేట్ ఉప సర్పంచ్
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం వడ్డేపల్లి పరిసర గ్రామాల్లో వేల మంది రైతులు గత 50 ఏళ్లుగా వ్యవసాయాన్నే నమ్ముకొని పంటలు పండిస్తున్నారు. అలాంటి భూముల్లో అకస్మాతుగా వ్యవసాయ భూముల్లో పరిశ్రమలు నెలకొల్పడం చాలా దారుణం. అయితే చుట్టు- పక్కల గ్రామల్లో మూగ జీవులు, వాగులు, వంకలు ఈ పరిశ్రమలతో సర్వనాశనం అవుతాయి. గత ఎనిమిది రోజులుగా మేము నిరసనలు చేస్తున్నాం. ఉన్నత అధికారులు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. అందుచేతనే నేడు కలెక్టరేట్‌కు లారీలలో వచ్చి మా గ్రామాల ప్రజలతో భారీ ఎత్తున్న ర్యాలీగా వెళ్లి నిరసనలు తెలియజేసి జిల్లా పాలన అధికారికి మా సమస్యలు తెలియజేయడం జరిగిందన్నారు.