Saturday, November 16, 2024

ఆయిల్ పామ్ సాగుతో రైతన్నలకు ఉజ్వల భవిష్యత్..

సిద్ధిపేట : సిద్దిపేటలో పర్యటించారు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. జిల్లాలోని న‌ర్మెట్ట వ‌ద్ద పామ్ ఆయిల్ క‌ర్మాగారం స్థాపించ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు. ఆసిద్దిపేట జిల్లాను రాష్ట్ర ఆయిల్ ఫెడ్‌కు ఇచ్చిన‌ట్లు చెప్పారు. రైతాంగానికి అయిల్ పామ్ సాగు కల్పవృక్షం అన్నారు. ఆయిల్ పామ్ సాగుతో రైతన్నలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంద‌న్నారు. అన్ని రకాల నేలలు ఈ పంట‌ సాగుకు అనుకూల‌మ‌ని తెలిపారు. తక్కువ పెట్టుబడితో 30 ఎండ్ల వరకు స్థిర ఆదాయం పొందే అవ‌కాశం ఉంద‌న్నారు. పామ్ ఆయిల్ సాగును తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రోత్స‌హిస్తుంద‌న్నారు. తెలంగాణలో 4 ఎండ్లలో 8 లక్షల ఎకరాలలో పామ్ ఆయిల్ పంట సాగుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింద‌న్న మంత్రి గడువులోగా నిర్దేశిత లక్ష్యం పూర్తి చేస్తే మరో 10 లక్షల ఎకరాలలో పంట సాగుకు ఆమోదం పొందే వీలుంద‌న్నారు.ఎకరా వరి సాగయ్యే నీటితో మూడెకరాల పామ్ ఆయిల్ సాగు చేయ‌వచ్చ‌ని మంత్రి తెలిపారు. ఈ పంట‌కు చీడ పీడలు, కోతులు, అడవి పందుల బెడద లేదన్నారు. అంతరపంటల సాగుతో అధిక లాభాలు పొందొచ్చ‌న్నారు. 4 సంవత్సరాల కాలం పాటు పామ్ ఆయిల్ పంట సాగుకు అయ్యే ఖ‌ర్చును ప్ర‌భుత్వం స‌బ్సీడీల రూపంలో వివిధ ర‌కాలుగా రైతుల‌కు అంద‌జేయాల‌ని యోచించిన‌ట్లు తెలిపారు. ప్రభుత్వ రాయితీ, నాబార్డ్ ద్వారా రుణ సౌకర్యం, ఉద్యానవన శాఖ ద్వారా డ్రిప్ సౌకర్యం, కంపెనీల బై బ్యాక్ గ్యారంటీ వంటి సౌక‌ర్యాల క‌ల్ప‌న‌తో ఈ పంట సాగు చేసే రైతుల‌ను ప్రోత్స‌హిస్తున్న‌ట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement