Saturday, November 23, 2024

ద‌శ‌ల‌వారీగా కొత్త కాల‌నీల అభివృద్ధి : మంత్రి హరీశ్ రావు

సిద్ధిపేట : కొత్త కాలనీలు ఏర్పడి ఇబ్బందులు ఎదురవ్వడం సహజమేనని, మౌలిక వసతులను దశల వారీగా కల్పిస్తూ.. టీహెచ్ఆర్ కాలనీ అభివృద్ధికి సహకరిస్తానని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పట్టణంలోని టీహెచ్ఆర్ నగర్ ముత్యాల పోచమ్మ, శ్రీనగర్ రేణుకా ఎల్లమ్మ, మోహినిపురా దీ కొండ మైసమ్మ, కాళ్ళకుంట కాలనీ మైసమ్మ, నర్సాపూర్-కేసీఆర్ నగర్ నల్ల పోచమ్మ, మాంకాలమ్మ, సౌడాలమ్మ ఆలయాలలో కన్నుల పండుగగా ఆషాఢ మాసం చివరి ఆదివారం కావడంతో అమ్మవార్లకు బోనాల పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించారు. కాగా ఇంటికి ఒక్క బోనం చొప్పున మహిళలు తీసుకవచ్చి, ఒక్క చోట కలిసి బోనాలను ఊరేగింపుగా చేసి అమ్మవార్లకు ప్రజలు తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ మేరకు ఆయా కాలనీల్లో ఉన్న దేవతలకు నిర్వహించిన బోనాల ఉత్సవంలో రాష్ట్ర మంత్రి హరీశ్ రావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఆషాఢ మాసం చివరి ఆదివారం కావడం, త్వరలోనే శ్రావణ మాసం ప్రారంభ నేపథ్యంలో అమ్మవార్లకు బోనాల పండుగ అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో అమ్మవారి దయతో జరపడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని అమ్మవార్లను కోరినట్లు మంత్రి తెలిపారు. ఎలాంటి రోగాలు రాకుండా ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా పడి పంటలు పండాలని, పశు, పక్షాదులు, పిల్లా పాపలు సల్లంగా ఉండాలని అమ్మవార్లను ప్రార్థించినట్లు పేర్కొన్నారు. టీహెచ్ఆర్ నగర్ కాలనీలో యూజీడీ, సీసీ రోడ్లు, రేషన్ షాపు ఏర్పాటు చేయిస్తానని, త్వరితగతిన పూర్తి అయ్యేలా చొరవ చూపుతానని, దశల వారీగా కొత్త కాలనీల అభివృద్ధికి సహకరిస్తానని మంత్రి హామీనిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement