Friday, November 22, 2024

నాలుగో రోజు కురిసిన వాన.. నిండిన చెరువులు, కుంటలు

ప్రభ న్యూస్, సిద్దిపేట బ్యూరో: వరుడు కరుణించడంతో నాలుగో రోజు వర్షాలు కురిశాయి. జిల్లాలోని పలు మండలాల్లో ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు పడ్డాయి. దీంతో చెరువులు, కుంటల్లోకి నీరు వచ్చి చేరుతోంది. సిద్దిపేట జిల్లాలో గత 24 గంటల్లో సరాసరి 42.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ములుగు మండలంలో అత్యధికంగా 78.2 మిల్లీమీటర్ల వర్షం కురవగా, బెజ్జంకిలో అత్యల్పంగా 28.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితం కావలసి వచ్చింది. అక్కడక్కడ శిథిలావస్థకు చేరిన ఇల్లు నాని కూలిపోయాయి. పలు చెరువులు మత్తడి దూకుతున్నాయి. మరికొన్ని మత్తడి దూకడానికి సిద్ధంగా ఉన్నాయి. చిన్నకోడూరు మండలం మందపల్లి చెరువు మత్తడి పారుతోంది. అలాగే దుబ్బాక నియోజకవర్గం లోని కూడవెల్లి వాగు, మిరుదొడ్డిలోని నాగయ్య వాగు, హుస్నాబాద్ నియోజకవర్గం లోని మోయ తుమ్మెద వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అధికారులు చర్యలు చేపట్టారు. చెరువులు, వాగుల వద్దకు ప్రజలు వెళ్లవద్దని అధికారులు కోరుతున్నారు. వర్షాల వల్ల విపత్కర పరిస్థితి ఎదురైతే డయాల్ 100, పోలీస్ కంట్రోల్ రూమ్ 8712667100 నంబర్లకు సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ శ్వేత కోరారు.

వర్షాలకు దెబ్బతిన్న పంటలు..
ఎడతెరిపి లేని వర్షాల కారణంగా చాలా చోట్ల మొక్కజొన్న, పత్తి, వరి తదితర పంటలు దెబ్బతిన్నాయి. వర్షాలకు వందలాది ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు సమాచారం. పత్తి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలామంది ఆలస్యంగా విత్తనాలు విత్తడంతో అవి మొలకెత్తని పరిస్థితి నెలకొంది. వర్షాల వల్ల పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో పంటలు నీట మునిగి పెట్టుబడి సైతం కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement