ప్రజలకు మరింత సేవ చేయడానికి ప్రజా పాలనలో తాను సైతం భాగస్వామి కావడానికి కాంగ్రెస్ పార్టీ పిలుపు మరియు కార్యకర్తల అభిప్రాయం మేరకు బీఎస్పీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు నీలం మధు ముదిరాజ్ ప్రకటించారు. కార్యకర్తల సమావేశంలో కార్యకర్తల సలహాలు సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నిర్వహించిన ప్రజా పాలనలో భాగస్వామిగా పాలుపంచుకొని ప్రజలకు మరింత సేవ చేయాలని తలంపుతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈనెల 15న తన వెంట నడుస్తున్న నాయకులు, కార్యకర్తలు,ఎన్ఎంఆర్ యువసేన సభ్యులతో గాంధీభవన్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ దీప్దాస్ మున్షి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు. 6 గ్యారంటీలతో ప్రతి ఇంటికి సంక్షేమం జరుగుతుందన్న తలంపుతో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న పాలన పట్ల ఆకర్షితులమై కార్యకర్తల ఆదేశాల మేరకు కాంగ్రెస్ లో చేరడానికి నిర్ణయం తీసుకున్నానని పునరుద్ఘాటించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ ఇచ్చి ప్రోత్సహించిన బీఎస్పీ పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ లో చేరిన వెంటనే అందరితో కలుపుగోలుగా ఉంటూ కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజలకు మరింత సేవ చేయడానికి ప్రణాళిక బద్ధంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. ఏఐసీసీ తో పాటు టీపిసిసి, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ పార్టీ అభివృద్ధికి తనవంతుగా పాటుపడతానని తెలిపారు.