రామచంద్రాపురం : ఒకప్పుడు నిండుకుండలా ఉండే చెరువు నేడు చుక్క నీరు లేకుండా పోయింది. వందల ఎకరాల సాగుకు నేనున్నానంటూ రైతులకు భరోసానిచ్చిన చెరువు నేడు మౌనంగా ఉండిపోయింది. రియల్టర్ల మాయలో చెరువులోకి రావాల్సిన వర్షపు నీళ్లు రాకపోవడం, ఎఫ్‌టిఎల్‌లో నిర్మాణాలు చేపడుతుండటంతో రోజు రోజుకు ఈ చెరువు తన ఉనికిని కోల్పోతోంది. భూముల ధరలకు రెక్కలు రావడంతో చెరువుల రూపురేఖలు మారిపోయి ఎడారి అవతారంలో దర్శనమిస్తున్నాయి. అభివృద్ధి మాటున తెల్లాపూర్‌లోని మేళ్ల చెరువు మాయమైపోతోంది. చెరువులను పరిరక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం, స్థానిక ప్రజాప్రతినిధులు చూసిచూడనట్లు మిన్కుండా ఉంటుండటంతో భవిష్యత్తులో తెల్లాపూర్‌లోని చెరువులు రియల్టర్ల ముసుగులో కప్పబడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి..
వివరాల్లోకి వెళితే..
తెల్లాపూర్ అందరికి సుపరిచితమే. ఇక్కడి భూముల ధరలు ఏ విధంగా ఉంటాయో కూడా తెలిసిందే. అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతోందో అదేవిధంగా భూగర్భజలాలు కూడా క్రమంగా దిగజారిపోతున్నాయి. తెల్లాపూర్ రైతులతో పాటు చుట్టు ప్రక్కల రైతుల వ్యవసాయం చేసుకునేందుకు నీటిని అందించిన మేళ్ల చెరువు నేడు ప్రమాదంలో పడిపోయింది. సర్వే నంబర్ 498లో 27 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న మేళ్ల చెరువుకు ఒకవైపు ఉస్మాన్‌నగర్ నుంచి మరోవైపు కొల్లూరు నుంచి వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఎప్పుడు చూసినా చెరువు నిండుకుండలా కనిపించేది. కాలాను గుణంగా వస్తున్న మార్పులతో చెరువు రూపంలోనూ మార్పు మొదలైంది. చెరువు చుట్టు బహుళ అంతస్థుల నిర్మాణాలు వెలుస్తుండడంతో పాటు చెరువులోకి నీరు వచ్చే క్యాచ్‌మెంట్ ప్రాంతాలన్నీ రియల్టర్ల హస్తాల్లో చిక్కుకుపోవడంతో రాను రాను మేళ్ల చెరువులోకి వరద నీరు రావడం తగ్గు ముఖం పట్టింది. పట్టా భూములు ఉన్నాయని వ్యవసాయం చేసుకోవాలంటూ కొద్ది రోజుల క్రితం కొందరు జేసిబీ సహాయంతో చెరువులోని తుమ్మ చెట్లను, ముళ్లపోదలను తీసివేయించి చదును చేయించారు. తదనంతరం రాత్రికి రాత్రే చెరువు మధ్యలో నుంచి మొరంతో రోడ్డును వేసేశారు. ఇంత జరుగుతున్నా అటు రెవెన్యూ అధికారులు కాని, ఇటు ఇరిగేషన్ అధికారులు కాని ఎవ్వరూ పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉంది. స్థానికంగా ఉండే మున్సిపల్ శాఖ అధికారులు కాని స్థానిక ప్రజాప్రతినిధులు కాని ఎవ్వరూ ఆ చెరువు వైపు వెళ్లడం కాని, పనులను నిలిపి వేయించే ప్రయత్నాలు చేయకపోవడం పలు అనుమానాలు తావిస్తొంది.
కళకళలాడే చెరువు..
ఒకప్పుడు జలకళను సంతరించుకుని ఉండే మేళ్ల చెరువు నేడు ఎడారిగా మారిపోతోంది. చెరువును పరిరక్షించాల్సిన వాళ్లు ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో తెల్లాపూర్ వాసులు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదు.. 27 ఎకరాల విస్తీర్ణంలో సువిశాలంగా ఉండే మేళ్ల చెరువు రియల్టర్ల పుణ్యమా నేడు కళావిహీనంగా మారిపోయంది. చెరువుకు 107 ఎకరాల ఆయకట్టు ఉండగా, 104 ఏకరాల వరకు ఎఫ్‌టిఎల్ ఉంది. వర్షాకాలంలో చెరువు నుండి అలుగు పారిన తర్వాత ఆ వరద నీళ్లు కాలువ గుండా ఇక్రిశాట్‌లోని చెరువులోకి చేరేవి. నేడు చూద్దామంటే చుక్కనీరు కూడా చెరువులో కనిపించడం లేదు.
పనులను ఆపి వేశాం.. ఏఇ ఇరిగేషన్.
చెరువు ఎఫ్‌టిఎల్‌లో చేపట్టిన రోడ్డు పనులను నిలిపివేశామని ఇరిగేషన్ ఏఇ సంతోషి తెెలిపారు. వరుసగా సెలవులు రావడంతో కావాలనే చెరువు ఎఫ్‌టిఎల్‌లో అవసరమైన చోట పైప్‌లు వేసి మొరంతో రోడ్డును వేశారన్నారు. ఇదే విషయాన్ని ఆర్.సి.పురం తహశీల్దార్‌ఒకు, ఇరిగేషన్ శాఖా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళామన్నారు. తహశీల్దార్ కార్యాలయం నుంచి పూర్తి వివరాలు రాగానే రోడ్డు వేసిన వారిపై పోలీస్ కేసు నమోదు చేయనున్నట్లు ఆమె తెలిపారు.
క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం.. తహశీల్దార్
మేళ్ల చెరువు ఎఫ్‌టిఎల్‌లో అక్రమంగా వేసిన మొరం రోడ్డును వెంటనే తొలగించి రోడ్డు వేసిన వారిపై క్రిమినల్ కేసులను నమోదు చేయనున్నట్టు తహశీల్దార్ శివకుమార్ తెలిపారు. వరుసగా సెలవులు రావడంతో చెరువు మద్యలో నుంచి రోడ్డును వేశారన్నారు. రోడ్డును వెంటనే తీసివేస్తామన్నారు, భవిష్యత్తులో ఎవరైనా చెరువులు, కుంటలను ఆక్రమించినా, లేక ఎఫ్‌టిఎల్‌లో నిర్మాణాలు చేపట్టినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
మాయమవుతున్న మేళ్లచెరువు..
Advertisement
తాజా వార్తలు
Advertisement