Thursday, November 21, 2024

Mdk: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ నేతల నిరసన


కేసిఆర్ కళ్యాణ లక్ష్మి , షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేయాలి
కేసిఆర్ చిత్రపటానికి వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ నేతలు


గజ్వేల్, అక్టోబర్ 7( ప్రభ న్యూస్) : మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ గజ్వేల్ లో సోమవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ లు కాంగ్రెస్ నేతలతో కలిసి వినూత్నంగా నిరసన చేపట్టారు. వారు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి ర్యాలీగా చేరుకొని క్యాంపు కార్యాలయం గోడకు వినతి పత్రాన్ని అతికించి, లోపల కేసీఆర్ చిత్రపటానికి వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ…. గత పది నెలలుగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ నిలిచిపోయిందన్నారు. అలాగే నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలన్నారు. గజ్వేల్ నియోజకవర్గ పేద ప్రజలకు అందాల్సిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మీరు సమయం కేటాయించని కారణంగా పంపిణీ ప్రక్రియ నిలిచిపోయిందని, దీంతో పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. అధికారులు సైతం మీ అనుమతి లేనిదే పంపిణీ కార్యక్రమం కుదరదని పేర్కొంటున్నారన్నారు. స్థానిక ప్రజలు మీపై నమ్మకంతో గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు.

గజ్వేల్ ప్రజలు తమ సమస్యలు, కష్టాలను పరిష్కరిస్తారనే భావంతో ఉండగా, మీరు గెలిచినప్పటి నుండి అందుబాటులో లేకపోవడం బాధాకరమ‌న్నారు. అలాగే మీ క్యాంపు ఆఫీసు కూడా మీకోసం ఎదురు చూస్తోందన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చి ఈ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారంతో పాటు అసంపూర్తి దశలో ఉన్న బస్టాండ్ నిర్మాణం, రింగ్ రోడ్డు తదితర పనులు త్వరితగతిన పూర్తి చేయించాలని కోరారు. అలాగే పేద ప్రజలకు లక్కీ డ్రా ద్వారా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులను గుర్తించినా ఇప్పటి వరకు వారికి అందించలేదన్నారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని మీరు గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకొని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీతో పాటు పెండింగ్ పనులు పూర్తి చేయించాలని మనవి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement