అమీన్పూర్ : మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ప్రముఖ శైవ క్షేత్రమైన బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం జాతర మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. జాతర ఏర్పాట్లపై బుధవారం ఆలయ ఆవరణలో వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత పురాతన శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి మహాశివరాత్రి జాతర మహోత్సవాల విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. 16వ తేదీ లోపు అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు, చలువ పందిళ్ళు, తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 24 గంటల పాటు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. గత సంవత్సరం ఐదు లక్షల మంది భక్తులు జాతర ఉత్సవాలకు హాజరయ్యారని, ఈసారి మరింత భక్తుల సంఖ్య పెరగవచ్చని అన్నారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం అందించే నిధులతో పాటు దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, అమీన్పూర్ ఎంపీపీ దేవానందం, జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, దేవాలయ కమిటీ చైర్మన్ తులసి రెడ్డి, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, ఆలయ ఈవో శశిధర్, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, టిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు, పుర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement