రామచంద్రాపురం : గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, విజ్ఞాన సముపార్జన కోసం గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని శాఖ గ్రంథాలయానికి నూతన భవనం నిర్మించబోతున్నట్లు ఆయన తెలిపారు. గురువారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డితో కలిసి గ్రంథాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి ఏటా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయని, ఇందుకు అనుగుణంగా నిరుద్యోగుల కోసం పోటీ పరీక్షల పుస్తకాలను గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచడం జరుగుతోందని తెలిపారు. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో ప్రజలను మేలుకోలిపె జాగృతజ్యోతులుగా, సామాజిక విజ్ఞాన కేంద్రాలుగా, సాంఘిక ఉద్యమాలకు వ్యూహ నిర్మాణ స్థావరాలుగా గ్రంథాలయాలు దేదీప్యమానంగా వెలుగొందాయని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రంథాలయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పుష్ప నగేష్, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ అంజయ్య పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement