బాలకార్మికులు, నిరాశ్రయ బాలలు కనిపిస్తే సమాచారమివ్వండి
1098, 100, 112 టోల్ ఫ్రీ నెంబర్లు
జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి
మెదక్ ప్రతినిధి, ప్రభన్యూస్ : ఆపరేషన్ ముస్కాన్ – బృందం దాడుల్లో జిల్లా వ్యాప్తంగా 47మంది బాలకార్మికులకు వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించడం జరిగిందని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ మాట్లాడుతూ.. చిన్నారుల మొహంలో చిరునవ్వులు చిందించేలా ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలన్నారు. బడికెల్లాల్సిన బాల్యం పనికి వెళ్తుందని, దీన్ని రూపుమాపేందుకు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
జిల్లా పోలీస్ బృందం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్, సఖి సెంటర్, ఎడ్యుకేషన్, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్ మెంట్ అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ ముస్కాన్- బృందం దాడుల్లో కిరాణం షాపులు, మెకానిక్ షాపులు, హోటళ్లలో పనిచేస్తున్న బాలకార్మికులు, రోడ్డుపై భిక్షాటన చేస్తున్న పిల్లలను గుర్తించినట్లు తెలిపారు. నెల రోజుల్లో మొత్తం 47మంది బాల కార్మికులను గుర్తించి సంబందిత అధికారుల ద్వారా వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి అప్పగించడం జరిగిందన్నారు. అలాగే బాలలను పనిలో పెట్టుకున్న వారిలో ఒకరిపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.
ఎవరైనా బాలకార్మికులను పనిలో పెట్టుకున్నా, లేక వారితో బలవంతంగా పని చేయించినా, ఒంటరిగా బాధపడుతున్న బాలలను చూసినప్పుడు, ఆశ్రయం అవసరమైనా, తప్పిపోయినా, వదిలివేయబడిన బాలలను చూసినప్పుడు, శారీరకంగా, మానసిక, లైంగిక దోపిడికి గురవుతున్న బాలలను చూసినప్పుడు, హింసకు, బెదిరింపులకు గురవుతున్న వీధి బాలలను చూసినప్పుడు1098 లేదా డయల్ 100, 112కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.