పటాన్చెరు : పర్యావరణానికి పెనుముప్పుగా మారిన ప్లాస్టిక్ ను నియంత్రించడంతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఎంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షన్ 2023 కార్యక్రమాల్లో భాగంగా సోమవారం ఉదయం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి మైత్రి మైదానం వరకు ఏర్పాటుచేసిన సైకిల్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. ప్రతి ఒక్కరికి స్వచ్ఛతపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షన్ ద్వారా వివిధ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు. ప్రధానంగా చెత్తను బహిరంగ ప్రదేశాల్లో పారవేయకుండా స్వచ్ఛ ఆటోలకు అందించడంతోపాటు 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ కవర్లను వినియోగించకూడదని కోరారు. ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్ల ఆవరణలో మొక్కల పెంపకానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, జిహెచ్ఎంసి అధికారులు, సైక్లింగ్ బృంద సభ్యులు పాల్గొన్నారు.