Tuesday, November 26, 2024

TS: కాంగ్రెస్ ను ఖతం చేద్దాం.. నీలం మధు ముదిరాజ్

కొడంగల్, ఆందోల్, పటాన్చెరులలో ఓడిద్దాం
నమ్మించి మోసం చేశారు
పాదయాత్ర చేస్తున్న నన్ను ఢిల్లీకి పిలిచి టైం వేస్టు చేయించారు
రేవంత్ కుల అహంకారి
ఆందోల్ లో దామోదర కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తా
నా జాతి గౌరవమే నాకు ముఖ్యం
బహుజన బిడ్డ ఎదుగుదలను ఓర్వలేక పోతుండ్రు
బిఎస్పి పార్టీ ఏనుగు గుర్తుపై పోటీ చేస్తున్నా
మీ బిడ్డగా కడుపులో పెట్టుకోండి
ఆశీర్వదించి.. గెలిపించండి
మీ ఇంటి బిడ్డనై సేవ చేసుకుంటా
ముదిరాజ్ రాష్ట్ర నేత నీలం ముదిరాజ్

(ప్రభ న్యూస్ బ్యూరో, ఉమ్మడి మెదక్) :
బహుజన బిడ్డ ఎదుగుదలను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అడుగడుగునా అడ్డుకున్నాయని ఇందుకు ఆ పార్టీల కుటిల రాజకీయమే నిదర్శనమని ముదిరాజ్ సామాజిక రాష్ట్ర నేత నీలం మధు ముదిరాజ్ స్పష్టం చేశారు. 22 సంవత్సరాలు సేవ చేసుకుని బీఆర్ఎస్, పిలిచి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీలను బహుజనులు బొంద పెట్టాలని పిలుపునిచ్చారు.


ఉమ్మడి మెదక్ బ్యూరో, నవంబర్ 10 (ప్రభ న్యూస్): బహుజనులను ఎదగనీయకుండా వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను భూస్థాపితం చేయాలని ముదిరాజ్ సామాజిక రాష్ట్ర నేత నీలం మధు ముదిరాజ్ స్పష్టం చేశారు. శుక్రవారం బీఎస్పీ పార్టీ తీర్థం పుచ్చుకుని ఆ పార్టీ నుండి నామినేషన్ దాఖలు చేసేందుకు గానూ ముందుగా చిట్కూల్ లోని మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున చిట్కూల్ కు చేరుకున్న ఆయన మద్దతుదారులను ఉద్దేశించి నీలం మధు మాట్లాడారు.



కాంగ్రెస్ పార్టీ థర్డ్ లిస్టులో పేరును ప్రకటించి బీ-ఫార్మ్ ఇవ్వడంలో మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సేవ చేయించుకుని మొండి చేయిస్తే.. కాంగ్రెస్ పార్టీ తడిబట్టతో గొంతు కోసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పఠాన్ చెరులో నీలం మధు నిలబడితే ఆ పార్టీలకు పుట్టగతులు ఉండవని ముందే ఊహించి రాజకీయంగా అణచివేసేందుకు కుట్ర పన్నారని.. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని ప్రజలే తన ధైర్యమని, వారి ఆశీర్వాదమే తనకు కొండంత బలమని స్పష్టం చేశారు.


కాంగ్రెస్ ను ఖతం చేద్దాం
..
బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకుంటే ఆ పార్టీని వీడి అక్టోబర్ 16న గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తే ప్రజాదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి పిలిచిందన్నారు. టికెట్ తనకే అని చెప్పి రెండో లిస్టు, మూడో లిస్టు అంటూ పక్షం రోజులు తన టైం వేస్టు చేయించి తీరా లిస్టులో పేరును ప్రకటించి బీపార్మ్ ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచిందన్నారు. రేవంత్ రెడ్డి పఠాన్ చెరులో నీలం మధు ముదిరాజ్ కు టికెట్ ఇచ్చానని, సభల్లో ప్రసంగాలు గుప్పించి ముదిరాజ్ ల ఓట్లు దండుకునేందుకు ఓ వైపు కలరింగ్ ఇస్తూనే మరో వైపు మోసం చేసి బీపార్మ్ ఇవ్వకుండా ముఖం చాటేసి మోసం చేశాడని ముదిరాజ్ లు ఇలాంటి కుట్రపూరిత మోసాలను ఎండగట్టి నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కొడంగల్ లో రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలన్నారు. కొడంగల్ లో రేవంత్ రెడ్డి, ఆందోల్ లో దామోదర రాజనర్సింహ, పఠాన్ చెరులో కాట శ్రీనివాస్ గౌడ్ ను ఓడించాలని, బహుజనులకు ముఖ్యంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి నీలం మధు పిలుపునిచ్చారు.

- Advertisement -



దామోదర ఖబర్ధార్..

ఆందోల్ కాంగ్రెస్ అభ్యర్ధి దామోదర రాజనర్సింహ తనకు బీఫార్మ్ రాకుండా అడ్డుపడ్డాడని నీలం మధు ఆవేదన వ్యక్తం చేశారు. నా ఎదుగుదలకు కుట్ర పన్నిన దామోదర రాజనర్సింహ ఆందోల్ లో ఎలా గెలుస్తాడో చూస్తానని సవాల్ విసిరాడు. ఆందోల్ లో ముదిరాజ్ ల ఆత్మ గౌరవ సభ నిర్వహించి తడాఖా చూపుతానన్నారు. అవసరమైతే దామోదర రాజనర్సింహకు వ్యతిరేకంగా ఆందోల్ లో ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు.


ఓట్లడిగేందుకు వస్తే తరిమి కొట్టండి..

కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఓట్లు అడిగేందుకు వస్తే బహుజన బిడ్డ అయిన నీలం మధును ఎందుకు
అన్యాయానికి గురి చేశారని నిలదీయాలని నీలం మధు ఎన్ఎంఆర్ యువసేన, నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. నీలం మధు ఫాలోవర్స్ రాష్ట్ర వ్యాప్తంగా వారి ప్రేమ, అభిమానాలతోనే ఈ రోజు ఇంత వాడినయ్యానని, ప్రజల మద్దతే తన బలమని, వారి అభిమానమే తనకు కొండంత అండ అని స్పష్టం చేశారు. ఓట్లడిగేందుకు వచ్చే కాంగ్రెస్ శ్రేణులను గ్రామ, గ్రామాన తరిమికొట్టాలని నీలం మధు పిలుపునిచ్చారు.


కాంగ్రెస్ జెండాలను తగల బెట్టిన ఎన్ ఎం ఆర్ యువసేన..
తమ రాష్ట్ర నేతైన నీలం మధు ముదిరాజ్ కు కాంగ్రెస్ బీ ఫార్మ్ ఇవ్వకుండా మోసం చేసిందని ఆగ్రహిస్తూ శుక్రవారం ఎన్ఎంఆర్ యువసేన బైక్ ర్యాలీ తీసి ఇస్నాపూర్ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై ఆందోళన చేసి దామోదర రాజ నర్సింహా ఖబడ్దార్ అంటూ నినదించి కాంగ్రెస్ జెండాలను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు.


బహుజన బిడ్డ ఎదుగుదలను ఓర్వలేక పోతుండ్రు … ఏనుగు గుర్తుపై పోటీ చేస్తున్నా..


కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే బీఎస్పీ పార్టీ పై ఏనుగు గుర్తుపై పోటీ చేయాలని కోరగా.. ప్రజా అభిప్రాయం మేరకు ఆ పార్టీ ఏనుగు గుర్తుపై పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు నీలం మధు స్పష్టం చేశారు. అన్యాయానికి గురైన నీలం మధును అన్నివర్గాల ప్రజలు మీ బిడ్డగా కడుపులో పెట్టుకోవాలని, ఆశీర్వదించి.. గెలిపిస్తే మీ ఇంటి బిడ్డనై మీలో ఒకరినై సేవ చేసుకుంటానని ముదిరాజ్ రాష్ట్ర నేత నీలం ముదిరాజ్ తేల్చి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement