Sunday, November 24, 2024

MDK: పర్యవేక్షణ లోపం.. అగ్నికి ఆహుతవుతున్న హరితహారం మొక్కలు

చేర్యాల: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు అగ్నికి ఆహుతైపోతున్నా పట్టించుకునే నాధుడు కరువయ్యాడు. చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని గుంటూరుపల్లి నుండి వేచరేని గ్రామానికి వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరవైపులా ఉన్న మొక్కలు అగ్నికి ఆహుతై మాడిపోయాయి.

అదేవిధంగా కడవెరుగు గ్రామంలోని పెట్రోల్ బంకు వద్ద రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కలు కూడా అగ్నికి ఆహుతై బూడిదగా మారాయి. కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమానికి అధికారుల పర్యవేక్షణ లోపంతో తూట్లు పొడుస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ పక్కన పెడితే అధికారులకు ప్రధాన రోడ్లపైన మొక్కలు కాలిపోయి ఉండడం కనిపించడం లేదా అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొక్కలను ధ్వంసం చేసిన వారిపై, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement