Friday, November 22, 2024

మంజీర నదిలోకి కాళేశ్వ‌రం గోదావ‌రి జలాల‌ను విడుద‌ల చేసిన కెసిఆర్..

హైదరాబాద్‌, : కాళేశ్వర గోదావ‌రి జలాలు మంజీర నదిలో సంగ‌మించిన అపూర్వ ఘ‌ట్టం నేడు సాక్షాత్క‌రించింది.. కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి సంగారెడ్డి కాల్వలో పారుతున్న కాళేశ్వర జలాలను వర్గల్‌ మండలం అవుసులపల్లి గ్రామంలో సంగారెడ్డి కెనాల్‌ నుంచి హల్దీ కాల్వలోకి విడుదల చేశారు. నీటి విడుద‌ల సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు హ‌రీష్ రావు, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డితో పాటు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ నీరు విడుద‌ల‌తో వట్టిపోయి వానాకాలంలో శుష్కించి కనిపించే నిజాంసాగర్‌ను నింపబోతున్నాయి. కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి సంగారెడ్డి కెనాల్‌ ద్వారా హల్దీ వాగులోకి కాళేశ్వర గంగ అడుగుపెట్టింది . హల్ది వాగు నుంచి సుమారు 96 కిలోమీటర్ల దూరంలోని నిజాంసాగర్‌కు ఈ నీరు 10 రోజుల‌లో చేర‌నుంది. దీంతో ఉమ్మడి మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాలు సస్యశ్యామలం కానున్నాయి. కూడవెల్లి వాగు ద్వారా అప్పర్‌ మానేరును నింపుతున్న కాళేశ్వరం జలాలు ఇపుడు హల్ది వాగు ద్వారా మంజీరాలో కెసిఆర్ చేతుల మీదుగా క‌లిశాయి.. అక్కడి నుంచి ఆ నీరు వ‌డివ‌డిగా నిజాంసాగర్‌లోకి పరుగులు పెడుతున్నాయి..కాగా, మేడిగడ్డ నుంచి రిజర్వాయర్లు, బ్యారేజ్‌లను నింపుకుంటూ కాళేశ్వర జలాలు 618 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ సిగలో చేరాయి. ఇపుడు మంజీరాని మీటి.. నిజాంసాగర్‌కు కొత్త జీవం అందించ బోతున్నాయి. సంగారెడ్డి కాల్వకు నీటిని విడుదల చేయ‌డంపై రెండు జిల్లాల రైతాంగంలో హర్షం వ్యక్తమవుతోంది. పూర్వవైభవం కోల్పోయి.. పూర్తిగా వట్టిపోయిన నిజాంసాగర్‌కు జలకళ తీసుకురావడం అద్భుత, అపురూప సన్నివేశంగా రైతాంగం భావిస్తోంది. మంజీరా నదిపై ఎగువ ప్రాంతంలో కర్నాటక, మహా రాష్ట్రలు ఇబ్బడిముబ్బడిగా ఆనకట్టలు కట్టడంవల్ల కొన్ని సంవత్సరాలుగా నిజాంసాగర్‌ బోసిపోతోంది. వానాకాలంలో నీళ్లులేక కళావిహీనంగా మారింది. ఈ పరిస్థితిలో కొండపోచమ్మ సాగర్‌ నుంచి కాళేశ్వరం జలాలను తరలించడంవల్ల రైతులకు మేలు కలగనుంది. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లా రైతాంగానికి రెండు పంటలు సాగు చేసుకునే అవకాశం దొరకడంతో పాటు సాగునీటి కోసం తిప్పలు పడే దుస్థితి తొలుగుతుంది.
అద్భుత చరిత్రకు నాంది: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదికి సరికొత్త నడక నేర్పిన సీఎం కేసీఆర్‌ పరిపాలనలో జీవనది గోదావరి తెలంగాణ వ్యాప్తంగా బీడు భూములను జీవం పోస్తూ ముందుకు సాగుతోందని, కొండపోచమ్మ సాగర్‌ ప్రాజెక్టు నుంచి హల్ది వాగు ద్వారా మంజీరా నదిలోకి కాళేశ్వరం జలాలను తీసుకురావడం అద్భుతమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మేడిగడ్డ వద్ద సముద్ర మట్టానికి 100 మీటర్ల ఎత్తులో ఉన్న గోదావరి జలాలను లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పద్ధతిలో సముద్ర మట్టానికి 600 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ సాగర్‌ వరకు సుదీర్ఘ దూరంలో గోదావరి జలాలను తరలించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుం దన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇప్పటికే లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తున్న సీఎం కేసీఆర్‌ పూర్వ వైభవం కోల్పోయిన నిజాం సాగర్‌ ప్రాజెక్టుకు జలకళ తీసుకువచ్చేందుకు కంకణం కట్టుకోవడం శుభ పరిణామమని, మంజీరా నదిలోకి వచ్చే కాళేశ్వరం జలాలు నేరుగా నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు చేరడం ద్వారా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. మంగళవారం సీఎం కేసీఆర్‌ కొండపోచమ్మ నీళ్లు నిజాంసాగర్‌కు తరలించేందుకు హల్ది వాగులో జలాలను విడుదల చేస్తున్న సందర్భంలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా రైతులకు కవిత శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement