Friday, September 20, 2024

MDK: జోరు వాన… ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం…

జలకళను సంతరించుకున్న జలాశయాలు
పొంగి పొర్లుతున్న చెరువులు, కుంటలు
జలమయమైన లోతట్టు ప్రాంతాలు
పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
నేలకూలిన నివాస గృహాలు
ఇబ్బందులు పడుతున్న ప్రజలు


మెదక్ ప్రతినిధి, ప్రభన్యూస్ : మెతుకుసీమ జోరు వానకు తడిసి ముద్దయింది. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలకు జలాశయాలన్నీ జలకళను సంతరించుకున్నాయి. చెరువులు, కుంటలు అలుగు పారుతుండగా, వాగులు, నదులు, ప్రాజెక్టుల్లోకి ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు భారీగా చేరుతున్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా, నివాస గృహాలు నేలకూలాయి. ప్రజలు బయటకు వెళ్ళలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణ శాఖ మెదక్ జిల్లాకు రెడ్ అలెర్ట్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అత్యవసర సేవలందించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది.

మెదక్ జిల్లాలో 21 మండలాలు, 469 గ్రామ పంచాయతీలు ఉండగా, 7.67,428 జనాభా ఉన్నారు. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో రెండు రోజులుగా వర్షం దంచికొడుతుంది. శుక్రవారం రాత్రి నుంచి తుంపర్లతో మురిపించిన వర్షం శనివారం మధ్యాహ్నం నుంచి జోరందుకుంది. ఆదివారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. శనివారం ఉదయం 8:40 నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల పాటు కురిసిన వర్షంతో జిల్లాలోని మెదక్ మండలం పాతుర్ లో అత్యధికంగా 20.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. జిల్లాలో అత్యధికంగా మెదక్ లో 175.5 మి.మీ వర్షపాతం నమోదు కాగా, కొల్చారం మండలంలో 120.5 మి.మీ వర్షపాతం నమోదైంది. అలాగే వెల్దుర్తి, కౌడిపల్లి, రేగొడ్, అల్లాదుర్గ్, చిన్నశంకరంపేట, మాసాయిపేట, చేగుంట, చిల్పిచెడ్, హవేలీఘనపూర్, శివ్వంపేట, తూప్రాన్ మండలాల్లో అధిక వర్షపాతం నమోదవగా, నర్సాపూర్, పెద్దశంకరంపేట, పాపన్నపేట, రామాయంపేట, టేక్మాల్, నార్సింగి, నిజాంపేట, మనోహరబాద్ మండలాల్లో మోస్తారు వర్షాలు కురిశాయి.

- Advertisement -

జలాశయాలకు జలకళ :
మెదక్ జిల్లాలో గత కొంత కాలంగా నీరు లేక వెలవెలబోయిన జలాశయాలన్నీ రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలకళను సంతరించుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2694 చెరువులు, కుంటలు, వాగులు ఉండగా, ఇప్పటి వరకు కురిసిన వర్షాలకు 396 చెరువులు, కుంటలు అలుగు పారుతున్నాయి. 767 చెరువులు, కుంటల్లో 75-100 శాతం నీరు చేరాయి. 299 చెరువులు, కుంటల్లోకి 0-25 శాతం నీరు చేరగా, 415 చెరువుల్లోకి 25-50 శాతం, 817 చెరువులు, కుంటల్లోకి 50-75 శాతం నీరు చేరాయి. జిల్లాలోని హల్డి, పుష్పల వాగులు, మంజీర నదితో పాటు ఘనపురం, పోచారం ప్రాజెక్ట్ ల్లోకి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు చేరడంతో ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. మెదక్ – కామారెడ్డి జిల్లాల సరిహద్దులో గల పోచారం ప్రాజెక్ట్ నీటి మట్టం 18 అడుగులకు చేరింది. మరో 24 గంటలు ఎడతెరిపి లేకుండ వర్షాలు కురిస్తే పోచారం డ్యాం పొంగిపోర్లే అవకాశాలున్నాయి.

జిల్లాలో 621.4 మిల్లిమీటర్ వర్షపాతం నమోదు:
జిల్లాలో ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి (జూన్ 1 నుంచి) ఇప్పటి వరకు 543.4 మిల్లిమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 621.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ లెక్కన పడాల్సిన దానికంటే 14 శాతం వర్షం అధికంగా కురిసింది. జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లో సాధారణ వర్షపాతం కురియగా, అత్యధికంగా 1, అధికంగా 7 మండలాల్లో వర్షం కురిసింది. ఈ వానాకాలంలో ఇప్పటివరకు మాసాయిపేటలో 320.2 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా 650.3 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈలెక్కన పడాల్సిన దానికంటే 103.1 శాతం ఎక్కువ వర్షం కురిసింది. మెదక్ లో 642.1 మిల్లీమీటర్ల వర్షపాతంకు 915.1 మిల్లిమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది. ఈలేక్కన 42.5 ఎక్కువ వర్షపాతం నమోదైంది. అలాగే అల్లాదుర్గ్, చిప్పిచెడ్, మనోహరబాద్, కౌడిపల్లి, పాపన్నపేట, హవేలీఘనపూర్, నర్సాపూర్ మండలాల్లో స్వల్ప లోటు వర్షపాతం నమోదైంది.

ఇబ్బందుల పడుతున్న ప్రజలు:
వరుస వర్షాల కారణంగా జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా వరకు ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని మెదక్ మండలం మల్కాపూర్ తండా, హవేలీఘనపూర్ మండలం వాడీ పంచాయతీ పరిధిలోని ధూప్ సింగ్ తండా, కప్రాయిపల్లి తండాలకు వెళ్ళే ప్రధాన రహదారిలో నీటి ఉదృతి ఎక్కువగా ఉండటం వలన ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేని వర్షాలు, ఈదురు గాలులకు పలు నివాస గృహాలు నేలకూలాయి. దీంతో పలువురు నిరాశ్రయులయ్యారు.

కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు:
భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. 24 గంటల పాటు అత్యవసర సేవలు అందించేందుకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. అత్యవసర సేవల కోసం సంప్రదించేందుకు 9391942254 కంట్రోల్ రూమ్ నెంబర్ ను అందుబాటులో ఉంచారు. వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి జిల్లా అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు ప్రజలకు పలు సూచనలు చేశారు. అలాగే మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement