Tuesday, November 26, 2024

ఏళ్లు గడుస్తున్నా పూర్తికాని హాస్టల్‌ భవనం..

రేగోడ్ : నేటి బాలలే రేపటి పౌరులు అనే సూత్రాన్ని ఉద్దేశ్యంలో పెట్టుకొని ప్రభుత్వం విద్యాసంస్థలకు అనేక సౌకర్యాలు కల్పిస్తూ విద్యార్థినీ విద్యార్థులకు వసతి గృహాలను మంజూరు చేసింది. విద్యార్థులు మంచి విద్యను అభ్యసించాలని విద్యాబోధనతో పాటు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించడమే కాకుండా కోట్ల నిధులు మంజూరు చేస్తూ వారి కోసం వసతిగృహాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా నాణ్యమైన భోజనాన్ని అందించడంతో పాటు వసతి గృహాల్లో కూడా సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేగోడ్‌ మండలంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా హాస్టల్‌ భవనం నిర్మాణం పనులు ముందుకు సాగడం లేదు. దీనిపై జిల్లా అధికారులు దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. వివరాల్లోకి వెళితే.. మెదక్‌ జిల్లా మండల కేంద్రమైన రేగోడ్‌లోని మాడల్‌ హాస్టల్‌ భవనానికి సుమారు ఐదు సంవత్సరాల కిందట రూ. 1 కోటి 8 లక్షలతో హాస్టల్‌ మంజూరైంది. హాస్టల్‌ భవన నిర్మాణం పనులు మొదలుపెట్టడం జరిగింది. మొదట్లో చకచకా హాస్టల్‌ భవనం నిర్మాణ పనులు జరిగాయి. అర్దాంతరంగా పనులు నిలిపివేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాడల్‌ హాస్టల్‌ భవన నిర్మాణం పనులు నిలిచిపోయి సుమారు రెండు సంవత్సరాలు గడుస్తున్నా పనులు జరగకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు డబ్బులు ఉన్నాయా, లేవా అనే మాటలు పలువురి నోట వినిపిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వారి పర్యవేక్షణ లోపంతోనే మాడల్‌ హాస్టల్‌ భవన నిర్మాణం పనులు సాగడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు సైతం నిర్మాణం పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, ఎప్పటికప్పుడు నిర్మాణ పనులు పూర్తి చేయాల్సింది ఉండగా ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంతో పనులు అర్దాంతరంగా నిలిచిపోయాయి. సుమారు మాడల్‌ పాఠశాలలో పక్క గ్రామాల నుండి వందమంది విద్యార్థినీలు విద్యనభ్యసిస్తున్నారు. హాస్టల్‌ భవన నిర్మాణం పూర్తి అవుతే వారికి ఉపయోగకరంగా ఉంటుందని తల్లిదండ్రులు భావిస్తున్నప్పటికీ యేళ్లు గడుస్తున్నా హాస్టల్‌ భవన నిర్మాణ పనులు ముందుకు సాగకపోవడంతో విద్యార్థులకు శాపంగా మారిందంటున్నారు. పనులు జరగకపోవడంపై అధికారులు దృష్టి పెట్టాల్సింది ఉండగా నిద్రావస్థలో ఉండడంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మాడల్‌ హాస్టల్‌ భవన నిర్మాణం పరిస్థితి నెలకొంది. అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్న చందంగా అధికారులు వ్యవహరిస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రూ. 70 లక్షలు పెట్టినాము: కాంట్రాక్టర్‌ ప్రసాద్‌రావు మాడల్‌ హాస్టల్‌ భవన నిర్మాణం కోసం ఇప్పటికే రూ. 70 లక్షలు పెట్టామని కాంట్రాక్టర్‌ ప్రసాద్‌రావు అన్నారు. ఇప్పటి వరకు నయా పైసా కూడా రాలేవని అన్నారు. డబ్బులు ఎక్కడి నుండైనా వస్తే పనులు మొదలుపెట్టి త్వరలోనే మాడల్‌ హాస్టల్‌ భవనాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. విద్యార్థినీలకు హాస్టల్‌ ఎంతో ఉపయోగకరం: ప్రిన్సిపాల్‌ మంజరి రేగోడ్‌ మాడల్‌ పాఠశాలలో చుట్టు ప్రక్కల గ్రామాల నుండి విద్యార్థినీలు విద్యనభ్యసిస్తున్నారు. వీరు పాఠశాలకు రావడానికి నానా అవస్థలు పడాల్సి వస్తుంది. కాబట్టి హాస్టల్‌ భవన నిర్మాణం త్వరగా పూర్తి చేస్తే విద్యార్థినీలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడే ఉండి విద్యను అభ్యసించడంతో పాటు హాస్టల్‌ సౌకర్యం ఉన్నట్లుగా ఉంటుంది. అధికారులు స్పందించి త్వరగా హాస్టల్‌ భవనాన్ని పూర్తిచేసేలా చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement