Tuesday, November 26, 2024

ఇంటింటికి రక్షిత మంచినీరు ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే జీఎంఆర్

అమీన్పూర్ : ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించారని, అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందించేందుకు కృషి చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పదో వార్డు సాయి కాలనీలో గల సాయధామం అపార్ట్మెంట్ లో మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సరఫరా కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం స్థానిక ప్రజాప్రతినిదులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు మూడు భారీ రిజర్వాయర్లు నిర్మిస్తున్నామని, త్వరలోనే పూర్తి చేసి ప్రతి ఇంటికి మంచి నీరు అందిస్తామని తెలిపారు. ఒకప్పుడు మంచినీటి ఎద్దడికి అమీన్పూర్ గ్రామం చిరునామాగా ఉండేదని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల మూలంగా ప్రతిరోజు మంచినీరు అందించగలుగుతున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, స్థానిక కౌన్సిలర్ బోయిని బాలమణి బాలరాజు, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కో ఆప్షన్స్ సభ్యులు, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement