నర్సాపూర్, ఆగస్టు 10 (ప్రభ న్యూస్) : డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణంలో ప్రభుత్వం విఫలమైందని బిజెపి ఎన్నికల కమిటీ చైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. గురువారం నర్సాపూర్ పట్టణంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడు సంవత్సరాలు అయినా పూర్తికాని డబుల్ బెడ్రూమ్ ఇల్లు తుప్పు పట్టిన స్క్రాప్ స్టీల్ తో ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నారని, నాసిరకంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు చేపడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల 91 వేల ఇల్లు మంజూరు కాగా… ఇప్పటివరకు కేవలం 35వేల ఇండ్లు మాత్రమే పంపిణీ చేశారని ఆయన విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి 9వేల కోట్లు ఇవ్వగా.. వాటితో తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు ఖర్చు పెడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో మూడున్నర కోట్ల ఇండ్లు కట్టించిందన్నారు. కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప పనులు మాత్రం తంగేళ్లు దాటవని ఎదేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నర్సాపూర్ లో 500 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. 500 ఇండ్లకు లబ్ధిదారుల నుంచి రెండువేల దరఖాస్తులు వచ్చాయన్నారు ఎన్నికల సమయం వరకు సైతం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేయరన్నారు. మాయ మాటలతో మోసం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉన్నారు.