ప్రభ న్యూస్ గుమ్మడిదల : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గుండెలనిండా ఆశీర్వదించి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రజలకు పిలుపునిచ్చారు. మెదక్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల టోల్గేట్ వద్ద ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలోని పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. వేలాది మంది కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, మహిళలు, యువకులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలను చేతబూని తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఒగ్గు కళాకారులు, బోనాలు, గుర్రాలు, పోతురాజులు, గంగిరెద్దులు, పీర్లు, డప్పులు, కోలాటాలు, కోయలు, ఒగ్గు కళాకారులు, తదితర కళారూపాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ వరప్రదాయని కాలేశ్వరం జలాలతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగులోకి తీసుకువచ్చి, పచ్చని పొలాలతో సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరినీ భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వేలాదిమంది కార్యకర్తలతో ఘన స్వాగతం పలికినందుకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ శరత్ కుమార్, ఎస్పి రమణ కుమార్, ఎంపీపీ సద్ది ప్రవీణ భాస్కర్ రెడ్డి, జడ్పిటిసి కుమార్ గౌడ్, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలైన బోనాలు గొల్ల కురుమల డప్పు వాయిద్యాలతో జిఎంఆర్ కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు.