Friday, November 22, 2024

MDK: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.. కలెక్టర్

నర్సాపూర్, ఆగస్టు 26 (ప్రభ న్యూస్) : ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవంలో కోటి మొక్కల వృక్షార్చనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు శనివారం నర్సాపూర్ మండల పరిధిలోని పెద్ద చింతకుంట గ్రామ శివారులో గల జల హనుమాన్ ఆవరణలో కలెక్టర్ రాజార్షి షా, అదనపు కలెక్టర్ రమేష్ లతో కలసి మొక్కలు నాటారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ… జల హనుమాన్ ఆలయంలో 750 మొక్కలను నాటారని, జిల్లా వ్యాప్తంగా ఐదు లొకేషన్లలో నాలుగు లక్షల నలభై వేల మొక్కలను నాటడం జరుగుతుందన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో 700 చొప్పున మొక్కలు నాటాలని ఆయన అధికారులకు సూచించారు. మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన సూచించారు.

మొక్కలు నాటి వాటిని పూర్తిగా రక్షించినప్పుడే నిజమైన హరితహారం అని ఆయన పేర్కొన్నారు. ఈనెల 23న జరిగిన సీఎం కేసీఆర్ బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ నర్సాపూర్ మీదుగా వెళుతున్న సమయంలో రోడ్డుకు ఇరువైపులా ప్లాంటేషన్ చూసి సంతోషం వ్యక్తం చేశారని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ప్రతి ఒక్కరూ ఓటర్ నమోదు చేసుకోవాలని ఓటర్ నమోదు సదస్సును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇదివరకు ఓటర్ లిస్టు కలిగిన వారు ఏవైనా పేరు, ఫోటోలు తప్పులుంటే సరి చేసుకోవాలని వారు సూచించారు. అనంతరం జల హనుమాను ఆలయంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డిఓ శ్రీనివాస్ డీఎఫ్ఓ రవి ప్రసాద్, తహసిల్దార్ కమలాద్రి, ఎఫ్ ఆర్ ఓ అంబర్ సింగ్, ఎంపీడీవో మార్టిన్ లూథర్, వైస్ ఎంపీపీ వెంకట నర్సింగరావు, గ్రామ సర్పంచ్ శివకుమార్, ఏపీఓ అంజిరెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement