Monday, November 25, 2024

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సామాజిక బాధ్యత : ఎస్పీ రమణ కుమార్

సంగారెడ్డి : ఇప్పటికీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో బాల కార్మిక వ్యవస్థ ఒకటిని, కార్మికులుగా పనిచేసే 5 నుంచి 14 సంవత్సరాలలోపు పిల్లల్ని బాలకార్మికులుగా పరిగణిస్తారని, పిల్లలు ఎవరైనా బాలకార్మికులుగా ఉన్నారంటే వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్లేనని సంగారెడ్డి ఎస్పీ ర‌మ‌ణ కుమార్ అన్నారు. ఆపరేషన్ స్మైల్-ఐఎక్స్ రివ్యూలో భాగంగా గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ మాట్లాడుతూ.. పరిశ్రమలు, వ్యవసాయం, తయారీ, మైనింగ్, నిర్మాణ రంగం, కర్మాగారాలలో, హోటల్స్‌లో, రైల్వే, బస్సు స్టేషన్‌లు, బిక్షాటన, సేవలు సహా అనేక రంగాల్లో బాలలు కార్మికులుగా పనిచేస్తున్నారన్నారు. చిన్నారుల‌కు సరైన విద్య లేకపోవడంతో ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని, పోటీతత్వంతో నిండిన సమాజంలో అన్నిరకాలుగా వెనుకబడిపోతున్నారన్నారు. పెద్దవారయ్యాక సరైన ఉపాధి దొరకని కారణంగా పలువురు నేరాలకు పాల్పడుతున్నారని, ఉపాధి మార్గాలు వెతుక్కునేందుకు సరైన మార్గదర్శనం, ఆర్థిక తోడ్పాటు లేకపోవడం, నైపుణ్యలేమి వంటి కారణాల వల్లే ఇలా మారుతున్నారని, నేటి బాలలే రేపటి పౌరులని..! చిన్నారులే దేశ ప్రగతికి సోపానాలని..! కానీ అభివృద్ధిలో పరుగులు పెడుతున్న నేటి హైటెక్ యుగంలోనూ ఇంకా వెట్టిచాకిరి వ్యవస్థ చిన్నారుల బాల్యాన్ని చిదిమేస్తోందిని..! అన్నారు.

బాలకార్మిక వ్యవస్థ.. చిట్టి చేతులను చిత్ర హింసలు పెడుతోందన్నారు. ఈ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకై తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ వివిధ శాఖల సహకారంతో ప్రతి ఏటా రెండుసార్లు జనవరి నెలలో ఆపరేషన్ స్మైల్, జూలై నెలలో ఆపరేషన్ ముస్కాన్ వంటి కార్యక్రమాలను నిర్వహించి అనేక మంది బాలకార్మికులకు విముక్తి కల్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈ సంవత్సరం జనవరి నెలలో ఆపరేషన్ స్మైల్-ఐఎక్స్ లో మొత్తం 112 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించడం జరిగింది. ఇందులో 26 మంది అమ్మాయిలు ఉండగా 86 మంది బాలురు ఉన్నారు. ఆపరేషన్ స్మైల్ ఐఎక్స్ బృందాలు గుర్తించి పట్టుకున్న వారిని సీడ‌బ్ల్యూసీ, డీసీపీవో కి అప్పగించడం జరిగిందన్నారు. తదుపరి పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరు పరచి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. బాలలను కార్మికులుగా పెట్టుకున్న యజమానులపై మొత్తం 34 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఎక్కడైనా బాలకార్మికులు కనబడితే వెంటనే డయల్ 100కి 1098 చైల్డ్‌ లైన్‌ టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించాలని ఎస్పీ ర‌మ‌ణ కుమార్‌ తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement