Tuesday, November 26, 2024

పైసా ఖర్చు లేకుండా పేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు : మంత్రి హరీశ్‌ రావు

గజ్వేల్ : రూపాయి ఖర్చు లేకుండా.. మీ చెమట చుక్క పడకుండా.. రెండు పడకల ఇళ్లు కట్టి పేదలకు అందిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం బెజగామ గ్రామంలో రైతు వేదిక, డబుల్ బెడ్ రూమ్ గృహా ప్రవేశాల కార్యక్రమంలో హాజరై లబ్ధిదారులను గృహా ప్రవేశాలు చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బెజగామ గ్రామంలో 20 మంది పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ దసరాకు ఇంటి అడుగు జాగలో ఇళ్లు కట్టుకునే వారికి రూ.3 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇళ్లు కట్టుకునేందుకు కేవలం రూ.60 వేల రూపాయలు ఇచ్చేదని, అవి దేనికీ బేస్మెంట్ కూడా సరిపోయేవి కావనీ, పైగా మధ్య దళారులకే డబ్బులు పోనూ, లోనూ రూపేణా 40 వేలు మీద పడి పోనూ కేవలం 10 వేలు చేతికి వచ్చేవనీ గత ప్రభుత్వ హయాంలో జరిగిన తీరును మంత్రి ఎండగట్టారు.

సీఎం కేసీఆర్ సారూ గజ్వేల్ రాకముందు, గజ్వేల్ లో గత పాలకులు పాలనలో పలు ఉదాహరణలు.. చెబుతూ.. కేసీఆర్ వచ్చాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విధానాలు వివరించారు. హైదరాబాద్ సనత్ నగర్ రైల్వే ఎరువుల తిప్పలు తప్పేలా.. గజ్వేల్ లో రైల్వే రేక్ పాయింట్ ఏర్పాటు చేసి మన జిల్లా రైతుల తిప్పలు సీఎం కేసీఆర్ తప్పించారని గుర్తు చేశారు. బెజగామలో 11 కేవీ విద్యుత్తు లైను నూతనంగా కావాలని గ్రామస్తుల కోరిక మేరకు ప్రతిపాదన తీసుకుని, కావాల్సిన కొత్త విద్యుత్తు లైను మంజూరు చేసి మరమ్మత్తు ప్రారంభించాలని విద్యుత్ అధికారులకు మంత్రి ఆదేశించారు. బెజగామ రవి చెరువు వద్ద బతుకమ్మ ఘాట్ మెట్లు కావాలని కోరిక మేరకు వెంటనే నిర్మిస్తామని గ్రామస్తులకు మంత్రి హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement