మెదక్ ప్రతినిధి, (ప్రభ న్యూస్): జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడే నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడేది లేదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. భారత ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన క్రమంలో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, జిల్లా అదనపు కలెక్టర్లు రమేష్, వెంకటేశ్వర్లతో కలిసి మాట్లాడారు. రాష్ట్రంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జిల్లాలో ఎన్నికల కోడ్ అమలుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
రాజకీయ నాయకులు, శాసనసభ్యులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయరాదని సూచించారు. ప్రభుత్వ స్థలాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించకూడదని పేర్కొన్నారు.మెదక్ జిల్లాలో 4,35,900 ఓటర్లు ఉన్నారని అందులో మెదక్ నియోజకవర్గంలో 2,14,118 ఓట్లు ఉండగా నర్సాపూర్ నియోజకవర్గంలో 2,20,782 ఓట్లు ఉన్నాయన్నారు.15,715 మంది యువ ఓటర్లు మొదటిసారి ఓటుహక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు.8882 మంది దివ్యంగులు,80 ఏండ్ల పై బడినవారు 4165 ఓటర్లు ఉన్నారన్నారు.
ఈ సారి నుంచి దివ్యాoగులు,సీనియర్ సిటీజన్స్ ఇంటి నుంచి ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించిందన్నారు. జిల్లాలోని 764 పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు.మహిళ పోలింగ్ స్టేషన్లు10,మోడల్ పోలింగ్ స్టేషన్లు 10 ఏర్పాటు చేస్తున్నామన్నారు.319 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అభ్యర్థులు ఎన్నికల కోసం ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతాలు తెరవాలన్నారు.
మత సంబంధ ప్రదేశాల్లో ప్రచారాలు వద్దు
మత సంబంధమైన ప్రదేశాల్లో రాజకీయ నాయకులు, పార్టీలు ఎన్నికల ప్రచారం చేపట్టరాదని కలెక్టర్ తెలిపారు. చర్చిలు, మసీదులు, ఆలయాల్లో ఆయా కమిటీలకు వాగ్దానాలు చేయడం, హామీలివ్వడం, పనులు చేపట్టరాదన్నారు. కుల, మత ప్రాతిపదికపై ఓటర్లను ప్రలోభపెట్టడం లాంటి చర్యలకు పాల్పడితే వారిపైనా కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు.
ఫ్లెక్సీలు తొలగించాలి
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున ప్రభుత్వ స్థలాల్లో ఉన్న రాజకీయ నాయకుల, పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు, పోస్టర్లు, కటౌట్లను 24 గంటల్లోపు తొలగించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై మున్సిపల్, పంచాయతీ చట్టాల మేరకు కేసులు నమోదు చేయాలని సూచించారు. ఎన్నికలు అయ్యేవరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ అతిథి గృహాలను ఎన్నికల యంత్రాంగం ఆధీనంలోనే ఉంచుకోవాలని నిర్ణయించి నట్లు కలెక్టర్ తెలిపారు.
రంగంలోకి ఫ్లైయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వైలెన్స్
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, తదితరమైనవి పకడ్బందీగా అవసరమైన బృందాలు రంగంలోకి దించుతామన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం మూడు ఫ్లైయింగ్ స్క్వాడ్లు, మూడు స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వివిధ పార్టీలు, పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలను రికార్డింగ్ చేయాలని సూచించారు. ఎక్కడైతే అక్రమ డబ్బు చెలామణి, మద్యం సరఫరా వంటివి ఉన్నాయో గుర్తించి అక్కడకు ఈ టీమ్లను పంపించి వీడియో చిత్రీకరించాలని సూచించారు. ఎన్నికల్లో జరిగే అక్రమాలు, అవకతవకలు, మద్యం, డబ్బు పంపిణీ తదితర వాటిపై ప్రజలు ఫిర్యాదులు చేయడానికి సీ విజిల్ యాప్‌తో పాటు కంట్రోల్ రూం 1950 ఏర్పాటు చేశామన్నారు.
జిల్లా సరిహద్దులో 5 చెక్ పోస్టులు: ఎస్పీ రోహిణి ప్రియదర్శిని
కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల నియామవళిని నిస్పక్షపాతంగా అమలు చేస్తామని జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు పటిష్ట నిఘా పెట్టాలన్నారు. మద్యం, నగదు సరఫరాపై నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. హింసాత్మక ఘటనలు జరిగే ప్రాంతాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.