Saturday, November 23, 2024

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం..

మెదక్‌ : దేశానికి వెన్నుముఖ అయిన రైతుకు వెన్నుదన్నుగా నిలవాలనే ధృఢసంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేయుటకు నిర్ణయించిందని, ఆ దిశగా జిల్లాలో విస్తృతంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ యస్‌. హరీష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు ఆరుగాళం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ చివరిగింజ వరకు కొనుగోలు చేయుటకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, దళారీలు, మధ్యవర్తుల మాటలకు ప్రలోభాలకు మోసపోవద్దని కలెక్టర్‌ సూచించారు. రైతుల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిగా రైతుని రారాజును చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు అండగా నిలుస్తూ దేశానికే తలమానికంగా నిలుస్తున్నారని గుర్తు చేశారు. ఈ యాసంగిలో జిల్లాలో 4 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మార్కెట్‌కు వచ్చే అవకాశముందని, అందుకనుగుణంగా ప్రాథమిక సహకార సంఘాలు, ఐకేపి మార్కెటింగ్‌ శాఖల ద్వారా సుమారు 350 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని అన్నారు. ఇందుకు సంబంధించి ఏప్రిల్‌ రెండవ వారం వరకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయడంతో పాటు తూకం, తేమను కొలిచే యంత్రాలు, ధాన్యం శుద్దిచేసే యంత్రాలు, గన్నీబ్యాగులు, టార్పలిన్లు, సుతిలి వంటివి కేంద్రంలో అందుబాటులో ఉంచాలని ఇటీవల అధికారులు, రైస్‌మిల్లర్ల యజమానులతో జ రిగిన సమావేశంలో ఆదేశించామని తెలిపారు. కాగా వరి ధాన్యానికి కనీస మద్దతు ధర క్వింటాలుకు గ్రేడ్‌-ఏ రకానికి 1888, సాధారణ రకానికి 1868 రూపాయలు చెల్లించబడునని అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకనుగుణంగా రైతులు ధాన్యాన్ని శుభ్రపరిచి ఎండబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావలసి ఉంటుందని అన్నారు. తేమ 17శాతం మించరాదని, అదేవిధంగా చెత్త, తాలు, మట్టిపెళ్లలు, రాళ్లు ఒక శాతం చెడిపోయిన, మొలకెత్తిన, పురుగుతిన్న ధాన్యం 4 శాతం పూర్తిగా తయారు కాని ముడుచుకుపోయిన ధాన్యం తీసుకువచ్చే ముందు ఒక కిలో నమూనా కొనుగోలు కేంద్రంలో చూయించి టోకెన్‌ పొంది అందులో చూపిన తేదీన ధాన్యాన్ని నాణ్యతా ప్రమాణాలకనుగుణంగా తీసుకురావాలని, తేడా ఉన్నట్లయితే కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన పాడి క్లీనేర్లు, విన్నోవింగ్‌ ఫ్యాన్ల సహయంతో శుభ్రం చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితులలో కళ్లం నుండి నేరుగా ధాన్యాన్ని మిల్లుకు తరలించరాదని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ధాన్యం తూకం వేసిన వెంటనే రసీదు పొందాలని, 72 గంటలలోగా డబ్బులు ఖాతాలో జమచేయబడతాయని అన్నారు. ధాన్యం అమ్ముకోవడంలో ఏమైనా సమస్యలు ఎదురైతే సంబంధిత అధికారులకు తెలపాలని, టోల్‌ప్రీ నెం. 180042500333 లేదా 1967 నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్‌ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement