మెదక్ : ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో పంట చేతికి వస్తుందని, ఎకరాకు 25వేల క్వింటాళ్ల చొప్పున నాలుగున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశముందని అదనపు కలెక్టర్ జి. రమేష్ అన్నారు. గడిచిన వర్షాకాలం కంటే ఈ యాసంగిలో 17వేల ఎకరాలలో పంటలు అధికంగా వేశామని, ఇదంతా సాగునీరు సకాలంలో అందించడం, 24 గంటల ఉచిత విద్యుత్ వల్లే సాధ్యమయ్యిందని అన్నారు. గురువారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నిర్వహణపై వ్యవసాయాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పాపన్నపేట, హవేళిఘణపూర్, మెదక్ మండలాల నుండి అత్యధికంగా ధాన్యం వచ్చే అవకాశమున్నందున వ్యవసాయాధికారులు అప్రమత్తంగా ఉండి రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి 17శాతం తేమ మించకుండా, తాలు లేకుండా తీసుకొచ్చిన తర్వాతే టోకేన్ ఇచ్చేలా చూడాలని అప్పుడే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభిస్తుందని తెలపాలని అన్నారు. గత ఖరీఫ్ కన్నా ఈరబీలో ధాన్యం ఎక్కువగా వచ్చే అవకాశమున్నందున అందుకనుగుణంగా 322 కేంద్రాల నుండి 350 కేంద్రాలకు పెంచామని, ఈ కేంద్రాలను సమర్దవంతంగా నిర్వహించవలసిన బాధ్యత పూర్తిగా వ్యవసాయాధికారులు, విస్తరణాధికారులపై ఉందని గుర్తు చేశారు. రైతులు హార్వేస్టింగ్, పంట కోతలు సక్రమంగా చేసేలా చూడాలని, మూడవరకం ధాన్యాన్ని మాత్రమే ప్యాడి క్లీనేర్ లో శుభ్రపరిచేలా రైతులకు సూచించాలని అన్నారు. ఈనెల 12న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నందున కేంద్రాలకు అవసరమైన అన్ని పరకరాలు, గోనె సంచులు సిద్దంగా ఉంచాలని, వర్షం పడే సూచనలు కనిపించిన వెంటనే రైతులకు సమాచారమిచ్చి ధాన్యంపై టార్పలిన్లు కప్పేలా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో డిఆర్డిఓ శ్రీనివాస్, ఆర్డీఓ సాయిరాం, జిల్లా వ్యవసాయాధికారి పరశురాంనాయక్, డిపిఓ తరుణ్, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement