దళిత బంధు దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్రమంత్రి హరీశ్ రావు అన్నారు. డా.బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భగా మంత్రి మాట్లాడుతూ…. 17,800 కోట్ల రూపాయలతో ఈ సంవత్సరం చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల మంది దళితులకు దళితబంధు అందించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. విడతలవారీగా ప్రతి పేద దళిత కుటుంబానికి రైతుబంధు అందజేస్తామన్నారు. దళిత బంధు లబ్ధిదారుల కుటుంబాల కోసం దళిత సంరక్షణ నిధిని కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తెలంగాణ సాధించిన తర్వాత రాష్ట్రంలో ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్లను రెట్టింపు చేశామన్నారు. 50 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను నెలకొల్పామన్నారు. మహిళా రెసిడెన్సియల్ పీజీ, లా కాలేజీలను నెలకొల్పామన్నారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఉందన్నారు. దళిత విద్యార్థుల విదేశీ విద్యకు ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద 20 లక్షల రూపాయలు గ్రాంటు ఇస్తున్నామన్నారు. ఇంజనీరింగ్ నిర్మాణాలలో ఎస్సీలకు 16 శాతం రిజర్వేషన్ జీవో తీసుకువచ్చామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 56 ఆస్పత్రుల ఎస్సీలకు డైట్, సానిటేషన్ పనుల్లో రిజర్వేషన్ కల్పించామన్నారు. డాక్టర్ అజయ్ ని వైద్య విధాన పరిషత్ కమిషనర్ గా నియమించామన్నారు.
అంబేద్కర్ భవన్ లో ఎస్సీ విద్యార్థులు చదువుకునేందుకు లైబ్రరీ ఏర్పాటు చేసేందుకు సంఘాలు ముందుకు వస్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంబేద్కర్ భవనాల్లో ఫిబ్రవరిలో ఏర్పాటుకు లక్ష రూపాయల నిధులను ఇచ్చి ప్రోత్సహిస్తామన్నారు. సిద్దిపేట తాత్కాలిక జిల్లా కలెక్టరేట్ ఏర్పాటుకు సహకరించి సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ భవనాన్ని అందించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ కోటి రూపాయలతో అంబేద్కర్ భవన్ ను అభివృద్ధి చేసేందుకు మున్సిపాలిటీ ద్వారా చర్యలు చేపడతామన్నారు. వచ్చే అంబేద్కర్ జయంతి లాగా సిద్దిపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పుతామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తున్నామన్నారు. 7300 కోట్ల రూపాయలతో మన ఊరు మన బడి కార్యక్రమాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం ద్వారా మరింత మంది పేద దళిత విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సిద్దిపేటలో నిర్మాణంలో ఉన్న రెండు స్మశాన వాటికలను ఉద్యానవనాల మాదిరిగా అభివృద్ధి చేస్తామన్నారు. 50 శాతం 2 బీహెచ్ కే లను దళితులకు కేటాయించామన్నారు. ఈ సంవత్సరం సిద్దిపేట పట్టణంలో సొంత ఇంటి జాగ కలిగిన 500 మందికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహకారం అందిస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.