రేగోడ్ : రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూశాఖ తీరుపై ఇప్పటికీ అసహనంగానే ఉంది. ప్రజలకు క్షేత్రస్థాయిలో సేలందించడంలో విఫలం, తీవ్రస్థాయిలో ఆరోపణల నేపథ్యంలో విఆర్‌ఓ వ్యవస్థనే ఎత్తివేసినా రెవెన్యూ శాఖ మారడం లేదు.. దృవీకరణ పత్రాలు కావాలన్నా, ధరణి రిజిస్ట్రేషన్‌లు కావాలన్నా, పట్టాపాస్‌పుస్తకాలు కావాలన్నా, పహాణి కాలంలో పేర్లు ఎక్కాలన్నా రెవెన్యూ అధికారుల ఆశీస్సులు ఉంటే తప్ప మండల కార్యాలయాల్లో పనిజరగడంలేదు. దీనికి ఉదాహారణగా మండల అధికారుల తీరును చెప్పవచ్చు. నిర్ణీత సమయ పాలన పాటించకుండా రైతులు, దృవీకరణ పత్రాల కోసం వస్తున్న సామాన్యులకు చుక్కలు చూపుతున్నట్లు సర్వత్రా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఆంధ్రప్రభ మండలంపై ఫోకస్ చేయగా 11 గంటలు దాటినా అధికారులు ఎవరూ తమ సీట్లో ఆశీనులు కాలేదు. మండల అధికారుల తీరుపై కలెక్టర్ హరీష్ దృష్టి కేంద్రీకరించి సేవలందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై కొరఠా ఝులిపించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రమైన రేగోడ్ తహశీల్దార్ కార్యాలయంలో ఉదయం 11 గంటలు కావస్తున్నా ప్రభుత్వ కార్యాలయానికి ఏ ఒక్క అధికారి రాకపోయిన సంఘటన రేగోడ్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో జరిగింది. వివిధ సమస్యలపై ప్రజలు తహశీల్దార్ కార్యాలయానికి రాగా 11 గంటల సమయం కావస్తున్నా తహశీల్దార్‌తో పాటు అధికారులు కార్యాలయంలో లేకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధికారుల పర్యవేక్షణ లోపంతోనే మండల స్థాయి అధికారులు విధుల పట్ల తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రాముఖ్యత కలిగిన వ్యక్తులచే తహశీల్దార్ కార్యాలయంలో అధికారులు పనులు చేస్తూ సామాన్యమైన ప్రజలకు ఇబ్బంది కలిగించడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తంతు ఒకరోజు రెండు రోజులు కాదు రోజు ఇదేపరిస్థితి నెలకొంటుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అధికారులు సమయపాలన పాటించకపోవడంతో రిజిస్ట్రేషన్‌లు కూడా ఆలస్యంగానే చేస్తున్నారని లబ్దీదారులు అంటున్నారు. పలు సమస్యలపై తహశీల్దార్ కార్యాలయానికి వస్తే రేపుమాపు అంటూ పొంతనలేని సమాధానం చెబుతూ కాలయాపన చేస్తున్నారని సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పనులు చేయాలంటే డబ్బులు కావాలని అడిగినప్పటికీ డబ్బులు ఇచ్చినా పని చేయడం లేదని మర్పల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు విలేకరులతో తెలిపారు. ప్రతి రోజు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పటికీ పనులు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
అప్పుడప్పుడు ఆలస్యం అవుతది..:తహశీల్దార్ సత్యనారాయణ
పై విషయమై తహశీల్దార్ సత్యనారాయణకు వివరణ కోరగా నిధుల విషయంలో అప్పుడప్పుడు ఆలస్యం అవుతదని, తహశీల్దార్ కార్యాలయంకు వచ్చిన ప్రజలకు సేవలు అందించడానికి సిద్దంగా ఉన్నాం. ఎలాంటి సమస్యలు ఉన్నా విచారణ చేపట్టి సమస్యలు పరిష్కరిస్తాం.
డబ్బులిచ్చినా పనిచేయడం లేదు: అనిల్ మర్పల్లి
మా తాతపేరున ఉన్న 133అ సర్వేనెంబర్‌లో ఎకరా 3 గుంటలన్నర భూమికి 9 గుంటల భూమిమాత్రమే ఆన్‌లైన్‌లో చూపిస్తుంది. మిగతా భూమిని ఆన్‌లైన్‌లో పెట్టాలని అధికారులను ప్రతి రోజు కోరుతున్నా పట్టించుకోవడంలేదు. గత సంవత్సరం కార్యాలయంలోని ఓ అధికారికి, విఆర్‌ఓకు డబ్బులు ఇచ్చినా భూమిని సరిచేయలేదు. మా తాతపేరుపై ఉన్న భూమి మానాన్న పేరున చేయడం లేదు. రెండేళ్లుగా తిరుగుతున్నా రేపుమాపు అంటూ కాలయాపన చేస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి న్యాయం చేయాలి.
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నాగయ్యస్వామి, సిందోల్
అధికారులు సమయ పాలన పాటించడంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గత కొన్ని నెలలుగా ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రకృతి వనానికి రెవెన్యూ అధికారులు స్థలాన్ని కేటాయించడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని అన్నారు. పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ పథకాలకు నీరుగారుస్తున్నారనడానికి అధికారులే నిదర్శనమని చెప్పవచ్చు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి సమయ పాలన పాటించని, ప్రభుత్వ పథకాలకు ఆటంకం కలిగిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.
కలెక్టర్ సాబ్.. జర దేఖో
Advertisement
తాజా వార్తలు
Advertisement