ఉమ్మడి మెదక్ బ్యూరో, జులై 16( ప్రభ న్యూస్): ప్రధాని మోఢీని ఢీ కొట్టే రాజకీయ చతురత కేవలం సీఎం కేసీఆర్ కు మాత్రమే ఉందని బాబూరావు మస్కె అభివర్ణించారు. మహారాష్ట్ర లోని చంద్రపూర్ జిల్లా రాజురా తాలూకా వాసి అయిన బాబురావు మస్కె ఆయన సతీమణి శోభ మస్కి భార్యాభర్తలు కలిసి జులై 1 నుండి పాదయాత్ర గా బయలుదేరారు. మొత్తం 21 రోజుల పాటు పాదయాత్ర చేసి హైదరాబాద్ ప్రగతిభవన్ కు చేరుకుని సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకోనున్నట్లు తెలిపారు. తన పాదయాత్ర ద్వారా కేసీఆర్ పాలనను మహారాష్ట్ర, తెలంగాణ ప్రజలకు వివరిస్తానని తెలిపారు.
బాబూరావు మస్కె సీఎం కేసీఆర్, తెలంగాణ సర్కారు గూర్చి మాట్లాడుతూ… తెలంగాణ సిరుల రాష్ట్రంగా అభివృద్ధి సాదించిందని ఇది కేవలం సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రైతాంగం సుభిక్షంగా ఉన్నారని, దీనికి ముఖ్యకారణం జలసిరులు కురిపించే ప్రాజెక్టుల నిర్మాణమేనన్నారు. ప్రపంచం మెచ్చే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి గోదావరి జలాలతో భూములకు నీరందించడమే కాక ప్రజల గొంతును తడుపుతున్నారన్నారు.
మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలను దేశం మొత్తం ఆచరిస్తుందని కేసీఆర్ అమలు పర్చుతున్న పథకాలను మోడీ సర్కారు కాపీ కొడుతోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి- సంక్షేమాన్ని దేశం మొత్తం కళ్లారా చూస్తుందని కేసీఆర్ పాలననే దేశం మొత్తం కోరుకుంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ ను మరోమారు నిండు మనస్సుతో ఆశీర్వదించాలని కోరారు.