పటాన్ చెరు : జీహెచ్ఎంసీ పరిధిలోని కాలనీలలో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షన్ – ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శనివారం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని శాంతినగర్ కాలనీలో కాలనీల ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి కాలనీని అన్ని విషయాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న సమున్నత లక్ష్యంతో ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమాలను చేపడుతోందని తెలిపారు. ఇందులో భాగంగా అన్ని శాఖల అధికారులు ప్రతిరోజు ఉదయం రెండు కాలనీలలో పర్యటిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరిస్తారని తెలిపారు. సమస్యల పరిష్కారానికి నిధులు అవసరమైతే అధికారుల ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరుగుతుందని తెలిపారు. 14 రోజులపాటు నిర్వహించే కార్యక్రమాలలో ప్రతి అధికారి నిబద్ధతతో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. వారం రోజులకు ఒకసారి తానే ప్రత్యక్షంగా సమీక్ష నిర్వహిస్తానని ఎమ్మెల్యే జీఎంఆర్ తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత లేదని తెలిపారు. ఈ సమావేశంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ బాలయ్య, వివిధ శాఖల అధికారులు, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.