గజ్వేల్, జులై 20 (ప్రభ న్యూస్) : గజ్వేల్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎదురులేదని రైతుబంధు సమితి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దేవి రవీందర్, డీసీఎంఎస్ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ జేజేల వెంకటేశం గౌడ్, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బెండే మధు లు అన్నారు. గురువారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. గజ్వేల్ నియోజకవర్గం గత 70 సంవత్సరాలుగా జరగనటువంటి అభివృద్ధిని, కేసీఆర్ గజ్వేల్ శాసనసభ్యునిగా ఎన్నికై ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 9 సంవత్సరాల కాలంలో గజ్వేల్ ప్రజల కలలకు ఊహకందని విధంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సుందరవనంగా తీర్చిదిద్ది పట్టణాలకు దీటుగా పల్లెలను అభివృద్ధి చేశారన్నారు.
గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కళ్ళు ఉండి చూడలేని గుడ్డివాళ్లు కాంగ్రెస్, బిజెపి నాయకులు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు మా పార్టీ లు గెలిస్తే అభివృద్ధి చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారని, గతంలో పాలించింది కాంగ్రెస్ పార్టీ కాదా… ఎందుకు గజ్వేల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఒకప్పుడు గజ్వేల్ నియోజకవర్గం అంటే కక్షలు కేసులతో రాజకీయాలు ఉండేవన్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్ అధికారంలో ఉండగా గజ్వేల్ నియోజకవర్గంలో ఎన్ని కేసులు ఉన్నాయో ఈ తొమ్మిది సంవత్సరాల ఎన్ని కేసులు అయ్యాయో ఒకసారి లెక్క తీద్దాం దానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. పచ్చని పల్లెల్లో మీ స్వార్థ రాజకీయాల కోసం అమాయకులను బలి చేశారన్నారు. గజ్వేల్ అభివృద్ధి మీద ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. విమర్శలు మానుకొని అభివృద్ధి కోసం కలిసి రండి అని పిలుపునిచ్చారు.