Monday, November 25, 2024

బిఎల్ఓ లు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలి.. జిల్లా కలెక్టర్ రాజర్షి షా

మెదక్ ప్రతినిధి, ప్రభ న్యూస్ : బిఎల్ఓ లు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ఫోటో ఎలక్టోరల్ రోల్ స్పెషల్ సమ్మరి రివిజన్-2023పై శిక్షణ కి బి.ఎల్. ఓ లు తప్పనిసరిగా హాజరు కావాలన్నాన్నారు. గురువారం మెదక్ పురపాలక శాఖ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి మాస్టర్ శిక్షకులచే, ఏర్పాటు చేసిన బూత్ స్థాయి అధికారులు, ఫోటో ఎలక్టోరల్ రోల్ స్పెషల్ సమ్మరి రివిజన్-2023పై శిక్షణ, అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సమర్దవంతమైన, స్పష్టమైన ఎలక్టోరల్ రోల్ చక్కగా తయారు చేయాలన్నారు. పారదర్శకమైన ఎన్నికల జాబితా తయారు చేయాలని, ఓటర్ల జాబితాలో మార్పులు చేయడంలో జాగ్రత్త వహించాలని సూచించారు. ఇంటింటి సర్వే ద్వారా ఓటర్ల జాబితాను నిర్దారించాలని, గరుడ (బిఎల్ఓ) యాప్ లో వివరాల నమోదు సక్రమంగా జరిగేలా చూడాలని, అందరూ బూత్ స్థాయి అధికారులు గరుడ యాప్ ను ఉపయోగించే విధంగా చూడాలని ఆయన తెలిపారు.

సమ్మరి రివిజన్ లో లోటుపాట్లు సరిదిద్దుకొని ఏ దశలోను తప్పిదాలకు తావులేకుండా ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఒక బూత్ లో 1500 కన్నా ఎక్కువ ఓటర్లు వున్నా, 2 కిలోమీటర్ల దూరం పోలింగ్ స్టేషనలు వున్నా కొత్త పోలింగ్ స్టేషన్ అనుమతి కోసం ఈసిఐ కి ప్రతిపాదనలు పంపి అనుమతి తీసుకుంటామని తెలిపారు. చనిపోయిన ఓటర్ల విషయంలో ఖచ్చితంగా మరణ దృవీకరణ పత్రాన్ని పొంది, కుటుంబ సభ్యుల ద్వారా వాకబు చేసిన తరువాతే ఓటరు జాబితా నుండి వివరాలను కచ్చితంగా తొలగించాలన్నారు. బిఎల్ఓలు, సూపర్ వైజర్లు పరిశీలించి అసలైన ఓటర్ పేర్లు తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

అనాధలు, ఒంటరి, కూలీ కోసం ఊరూరా తిరిగే వారి వివరాలను కూడా సేకరించి వారి స్థిర చిరునామా ఆధారంగా ఓటరుగా నమోదు చేయాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని, పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటరుగా ఉన్న ప్రతి ఒక్కరి ఫోటో, వివరాలు సరిగా ఉండాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వికలాంగులు, వృద్దుల కోసం ర్యాంపులతో పాటు ఇతర మౌళిక సదుపాయాలను ఖచ్చితంగా కల్పించాలన్నారు. బిఎల్ఓ లు ఇంటింటి సర్వే చేసిన ఫామ్ 6, 7, 8 ధరఖాస్తులను ఆర్డీఓ కార్యాలయంలో పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అంబాదాస్ రాజేశ్వర్, మెదక్ తహశీల్దార్ శ్రీనివాస్, బిఎల్ఎ లు, సూపర్ వైజర్లు, బిఎల్ఓ లు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement