మెదక్ – దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పోలీసులు అరెస్ట్ చేశారు. తమకు పరిహారం ఇవ్వకుండా అధికారులను మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ దగ్గరకు రానిచ్చేదిలేదంటూ గ్రామస్తులు గత కొన్ని రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నారు. వారికి మద్ధతుగా మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ ముట్టడికి నేడు బీజేపీ పిలుపునిచ్చింది. దాంతో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ దగ్గరికి బయలుదేరాడు. దాంతో పోలీసులు ఆయనను తొగుటలో అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రఘనందన్ మాట్లాడుతూ, ఏటిగడ్డ కిష్టాపూర్ నిర్వాసితులకు సిద్దిపేట,గజ్వేల్ తరహాలో పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కలెక్టర్, అధికారులు ప్రజాస్వామిక వాదులుగా పని చేయడం లేదని ఆరోపించారు. ఇది ఇలా ఉంటే సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్‌లో ఉద్రిక్తత కొనసాగుతోంది. కిష్టాపూర్‌కు వెళ్లడానికి ప్రయత్నించిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిన్న రాత్రి కాంగ్రెస్ నేత చెరుకు శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు. ఇక మల్లన్న సాగర్ కట్ట కోసం సిద్దిపేట నుంచి ఏటిగడ్డ కిష్టాపూర్‌కు వెళ్లే రోడ్డును కాంట్రాక్టర్ మూసివేస్తున్నాడు. దాంతో ఈ రోడ్డును మూసివేస్తే ఊరికి వెళ్లడం కష్టమౌతోందని.. రోడ్డు మూసివేయోద్దని గ్రామస్తులు కాంట్రాక్టరును అడ్డుకున్నారు. అంతేకాకుండా ఏటిగడ్డ కిష్టాపూర్ వాసులకు పరిహారం చెల్లించకుండానే మల్లన్న సాగర్ కట్ట నిర్మిస్తున్నారని వాపోయారు. గ్రామాన్ని ఎలాగైనా ఖాళీ చేయించాలన్న ఉద్దేశంతో కాంట్రాక్టర్ కట్ట నిర్మిస్తుండడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్ పనులను అడ్డుకుంటామని గ్రామస్తులు చేసిన హెచ్చరికతో భారీగా పోలీసులు మోహరించారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement