Wednesday, November 20, 2024

అవినీతిపై గళమెత్తిన యువకుడిపై దాడి : యువ‌కుడిపైనే కేసు న‌మోదు

పఠాన్ చెరు/అమీన్పూర్ : సోషల్ మీడియా వేదికగా గత కొన్ని రోజులుగా సాయి కిరణ్ అనే యువకుడు అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగా రెడ్డి అవినీతి పై గొంతెత్తుతున్న సంగతి తెలిసిందే.. ఇది జీర్ణించుకోలేని అతని కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం బంధం కొమ్ము పరిసర ప్రాంతాల్లో అటకాయించి దాడి చేశారు. ఘటనలో సాయి కిరణ్ తీవ్రంగా గాయపడగా.. ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా బాధితుడి పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయాల్సి ఉండగా… రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గి పోలీసులు యువకుడిపైనే కేసు నమోదు చేయడం కొసమెరుపు. పోలీసుల చర్యలపై సోషల్ మీడియా వేదికగా జనం నిలదీస్తున్నారు..
అమీన్పూర్ అవినీతిపై సాయి కిరణ్ వీడియోలు విడుదల :
గత కొన్ని రోజులుగా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అక్రమాలు, అవినీతిపై సాయి కిరణ్ యూ ట్యూబ్, ఫేస్ బుక్ వేదికగా ప్రశ్నిస్తున్నాడు. ఇది స్థానికంగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ జరుగుతుంది. దీంతో సాయి కిరణ్ పై ఛైర్మెన్ పాండు రంగారెడ్డి కుటుంబ సభ్యులు పగ పెంచుకున్నారు. వీడియోలో సోషల్ మీడియాలో రిలీజ్ చేయవద్దని సాయి కిరణ్ ను గతంలో ఓ మారు హెచ్చరించినట్లు కూడా తెలుస్తుంది. కానీ సాయి కిరణ్ వరుసగా వీడియోలు రిలీజ్ చేస్తూ ఛైర్మెన్ పాండు రంగా రెడ్డి అవినీతిపై యుద్ధం చేస్తున్నారు..
అక్కసుతోనే దాడి :
పఠాన్ చెరు నియోజకవర్గం ఆమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో సోషల్ మీడియా ద్వారా అమీన్పూర్ మున్సిపాలిటీలోని భూ కుంభకోణాలను వెలుగులోకి తీసుకువస్తున్నసాయికిరణ్ మారకపోవడం, తిరిగి, తిరిగి వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నాడు. ఓ వైపు హెచ్చరించినా మారకపోవడంతో సోమవారం మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి సోదరుడు ప్రతాప్ రెడ్డి, తనయుడు రుష్వంత్ రెడ్డి లు బందం కొమ్ము వద్ద సాయి కిరణ్ ను వారి అనుచరులతో కలిసి అడ్డగించి విచక్షణారహితంగా రాడ్ తో, చేతితో పిడి గుద్దులు గుద్దారు. దీంతో ఆ యువకుడిపై తీవ్రంగా దాడిచేశారు. స్థానికులు ఏకమై సాయి కిరణ్ ను పాండు రంగారెడ్డి మనుషుల నుండి రక్షించారు.
ఘటనపై సాయి కిరణ్ అమీన్పూర్ పోలీసులకు పిర్యాదు :
తనపై జరిగిన దాడిపై సాయికిరణ్ అమీన్పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి గాయాలతో ఉన్న సాయికిరణ్ ను ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి పై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ సాయి కిరణ్ పై పాండురంగారెడ్డి తరపున పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సాయి కిరణ్ పై కూడా కేసు నమోదు చేశారు.
పాండురంగా రెడ్డి నుండి నాకు ప్రాణ హాని ఉంది : సాయి కిరణ్
ఇది ఇలా ఉండగా దాడిలో తీవ్రంగా గాయపడిన సాయికిరణ్ తాజాగా మరో వీడియోను విడుదల చేశారు. తాను అవినీతి పై యుద్ధం చేస్తుంటే జీర్ణించుకోలేని ఛైర్మెన్ పాండురంగా రెడ్డి తనపై కక్షపూరితంగా దాడి చేయించారని, తన ప్రాణాలకు హాని ఉందని ఆ వీడియోలో వేడుకున్నాడు. పాండురంగారెడ్డి తనయుడు, సోదరుడు చేసిన దాడిని, తనకు గాయాలైన దృశ్యాన్ని వీడియోలో చూపించారు. తన పై జరిగిన ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తనకు రక్షణ కల్పించాలని సాయికిరణ్ వీడియోలో కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement